BJP-AIADMK Alliance | అన్నాడీఎంకే, బీజేపీ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, పళనిస్వామి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తామని వెల్లడించారు. ఎన్డీఏ భాగస్వామ్యం ఎన్నికల్లో విజయం సాధిస్తుందని, ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని తనకు నమ్మకం ఉందన్నారు. ఏఐఏడీఎంకే పొత్తు కోసం షరతులపై మీడియా స్పందించగా.. ఎలాంటి డిమాండ్ రాలేదన్నారు. అన్నాడీఎంకే 1998 నుండి ఎన్డీఏలో భాగంగా ఉందని, ప్రధాని మోడీ, మాజీ ముఖ్యమంత్రి జె జయలలిత గతంలో కలిసి పనిచేశారని కూడా షా గుర్తు చేశారు. అయితే, మళ్లీ కలిసి పని చేసేందుకు ‘ఇంత సమయం ఎందుకు పట్టింది? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ఈ కూటమి ఇకపై శాశ్వతంగా ఉంటుందని.. అందుకే సమయం పట్టిందన్నారు.
అన్నామలై స్థానంలో తమిళనాడులో కొత్త బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ను నియమించిన రోజే పొత్తులపై ప్రకటన రావడం విశేషం. మొన్నటి వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన అన్నామలై పదవి కోసం మళ్లీ పోటీ చేయకూడదని నిర్ణయించారు. కొత్త అధ్యక్షుడి పేరును సైతం అన్నామలై ప్రతిపాదించారు. ఇదిలా ఉండగా.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి గత నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అప్పటి నుంచి పొత్తుల అంశం తెరపైకి వచ్చింది. గత నెలలోనూ పొత్తులపై అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎంకేను గద్దె దించడానికి ఇదో అవకాశమన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిందని, శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. ఓట్లు వేర్వేరు పార్టీలకు మధ్య మారుతూ వృథా కావొద్దన్నారు. పొత్తు నిర్ణయాలు బీజేపీ జాతీయ నాయకత్వంపై ఆధారపడి ఉన్నాయన్నారు.
234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి వచ్చేలో ఎన్నికలు జరుగనున్నాయి. తమిళనాడులో ఏఐఏడీఎంకే, బీజేపీ పొత్తులకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1998 సార్వత్రిక ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని పార్టీ బీజేపీతో జతకట్టి రాష్ట్రంలోని 39 సీట్లలో 30 సీట్లను గెలుచుకుంది. అయితే, తర్వాతి సంవత్సరమే ఏఐఏడీఎంకే అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. 2004 లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది. ఏఐఏడీఎంకే కేవలం ఒక సీటును గెలుచుకోగా, బీజేపీకి ఒక్క సీటు దక్కలేదు. కేంద్రంలో ఎన్డీయే పాలన ముగియడంతో యూపీఏ తిరిగి అధికారంలోకి వచ్చింది. జయలలిత శకం తర్వాత, ఏఐఏడీఎంకే 2021 రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఈ కూటమి కేవలం 75 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. 2023లో ఈ కూటమి ముక్కలైంది. దీనికి బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై కారణంగా పేర్కొంటారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే, బీజేపీ విడిగా పోటీ చేసినా ఒక్కటీ గెలువలేకపోయాయి. డీఎంకే 39 సీట్లను కైవసం చేసుకుంది.