హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ వ్యక్తుల స్వాధీనంలో ఉన్న భూములు, ఇండ్లకు అవి ప్రభుత్వ స్థలాలంటూ కంచె ఎలా వేస్తారని హైకోర్టు సోమవారం హైడ్రాను నిలదీసింది. ఏ ప్రాతిపదికన ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వానిదని నిర్ణయించి కంచె వేస్తారని నిలదీసింది. కంచె వేయడానికి ముందు అనుసరిస్తున్న విధానమేమిటో వివరించాలని ఆదేశించింది. హైదరాబాద్ శివార్లలోని గండిపేటల 1600 చదరపు గజాల భూమి చుట్టూ ఉన్న కంచెను తొలగించాలని ఇచ్చిన ఆదేశాలను అమలు చేయరా? అని ప్రశ్నించింది. హైడ్రా అధికారులు కోర్టులకంటే ఉన్నతులమని భావిస్తున్నట్టు వ్యాఖ్యానించింది. ప్రైవేటు స్థలంలో సెప్టిక్ ట్యాంకుకు అడ్డంగా ఉన్న కంచెను తక్షణం తొలగించాలని, ప్రైవేటు స్థలంలో ఉన్న బోర్డును తొలగించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
తమ స్థలానికి, ఇంటికి చెందిన స్థలాల చుట్టూ హైడ్రా కంచె వేయడాన్ని సవాలు చేస్తూ హై కోర్టులో దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ సోమవారం విచారణ చేపట్టారు. దీనిపై హైడ్రా తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులు పరిశీలించి, నోటీసులు జారీచేసి ప్రభుత్వ స్థలాలకు కంచె వేస్తున్నామని చెప్పారు. ప్రస్తుత కేసులో సెప్టిక్ ట్యాంకు, దాని పకనే ఉన్న ప్రభుత్వ భూమికి కంచె వేశామని, పిటిషనర్లకు చెందిన స్థలానికి వేయలేదని తెలిపారు.
పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేస్తామని చెప్పగా.. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ అన్నీ నిబంధనల ప్రకారం చేస్తే వి వరాలు సమర్పించడానికి గడువు ఎందుకు అని ప్రశ్నించారు. హైడ్రాకు వ్యతిరేకంగా దాదాపు 400కుపై పిటిషన్లు నమోదయ్యాయని, ఇందులో ఎన్నింటిలో కౌంటర్లు దాఖలు చేశారని ప్రశ్నించారు. ప్రైవేట్ స్థలంలో ఉన్న కంచెను రికార్డులు పరిశీలించి తొలగించాలని ఆదేశించారు. గత వారం ఇచ్చిన ఆదేశాలు అమలయ్యాయో లేదో చెప్పాలంటూ విచారణను వాయిదా వేశారు.