న్యూఢిల్లీ/ హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్ -1 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థి వివాన్ శరద్ మహీశ్వరి ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. వంద పర్సంటైల్ స్కోర్ సాధించి సత్తాచాటాడు.
దేశవ్యాప్తంగా మొత్తం 12 మంది విద్యార్థులు మాత్రమే 100 పర్సంటైల్ స్కోర్‌ను సాధించగా, వీరిలో తెలంగాణ నుంచి వివాన్ శరద్ ఒక్కరే చోటు దక్కించుకున్నారు. అత్యధికంగా రాజస్థాన్ నుంచి ముగ్గురు వంద పర్సెంటైల్ సాధించారు. ఏపీ నుంచి ఇద్దరు, న్యూఢిల్లీ, బీహార్, ఒడిశా, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి ఒకరి చొప్పున 100 శాతం స్కోరు సాధించారు. మొత్తం 13.04 లక్షల మంది అభ్యర్థులు మొదటి ఎడిషన్ పరీక్ష రాశారు. వంద పర్సంటైల్ సాధించిన 12 మంది విద్యార్థులు పురుషులు కాగా వీరిలో 11 మంది జనరల్ క్యాటగిరీకి చెందినవారు.
100 శాతం స్కోరు సాధించిన అభ్యర్థుల జాబితాలో కబీర్ ఛిలార్, చిరంజీబ్ కర్, అర్ణవ్ గౌతమ్(రాజస్థాన్), నరేంద్రబాబు గారి మహిత్, పసల మోహిత్(ఆంధ్రప్రదేశ్), వివాన్ శరద్ మహీశ్వరి(తెలంగాణ), శ్రేయస్ మిశ్రా(ఢిల్లీ), శుభం కుమార్(బీహార్), బశేష్ పాత్రా(ఒడిశా), అమయ్ జైన్(హర్యానా), మాధవ్ విరాదియా(మహారాష్ట్ర), పురోహిత్ నిర్మయ్(గుజరాత్) ఉన్నారు. దేశంలో ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్ పేపర్-1 పరీక్ష జరిగింది. జనవరి 29న నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు తర్వాత వెలువడనున్నాయి. జేఈఈ మెయిన్ పరీక్షలకు దేశవ్యాప్తంగా 13,04,653 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
కాగా, జేఈఈ మెయిన్ మలి విడత పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. మొదటి విడత పరీక్షలో ఆశించిన స్కోరును సాధించని వారు రెండో విడత పరీక్షలు రాస్తారు. ఏప్రిల్ 2 నుంచి 9 వరకు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు జరుగుతాయి. ఈ రెండింటిలో ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకుని విద్యార్థులకు ర్యాంకులను కేటాయిస్తారు. ఆ తర్వాత సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా మొత్తం 2.50 లక్ష మంది అభ్యర్థులను జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
జేఈఈ మెయిన్ ప్రశ్నపత్రాల్లో తప్పుల మీద తప్పులు బయటపడుతున్నాయి. ప్రశ్నల్లో తప్పులు పునరావృతమవుతున్నాయి. ఈ సారి ఏకంగా 9 ప్రశ్నలు తప్పుగా ఇచ్చారు. ఫిజిక్స్ నుంచే అధికంగా ప్రశ్నలను తొలగించారు. విద్యార్థుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తుది కీలో ఆయా ప్రశ్నలను ఉపసంహరించింది. జనవరి 22వ తేదీన జరిగిన పరీక్షల్లోనే మూడు ప్రశ్నలపై అభ్యంతరాలు రాగా, ఆయా ప్రశ్నలను ఎన్టీఏ తొలగించింది. 23న రెండు, 24న మరో రెండు ప్రశ్నలను ఉపసంహరించింది. అంతేకాకుండా ఈ సారి ప్రాథమిక కీలోని ఆన్సర్లు కూడా మారాయి. ఆరు ప్రశ్నల సమాధానాలను ఎన్టీఏ మార్పు చేసింది.
ఈ సారి జేఈఈ మెయిన్ -1 ఫలితాలు నిరాశపరిచాయనే చెప్పవచ్చు. గతంతో పోల్చితే 300 మార్కులకు 300 మార్కులు సాధించిన వారు తక్కువగా ఉన్నారు. గతంలో 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండేది. కానీ ఈ సారి 12 మంది మాత్రమే ఈ స్కోర్‌ను సాధించారు. ఇక తెలంగాణ నుంచి ప్రతిసారీ నలుగురు, ఐదుగురు 100 శాతం స్కోర్‌ను సాధించేవారు. కానీ ఇప్పుడు ఒక్కరే సాధించారు. పరీక్షల్లో ఛాయిస్ ప్రశ్నల ఉపసంహరణతోనే ఫలితాలు నిరాశపరిచాయని అధ్యాపకులు అంటున్నారు.
జేఈఈ కోసం రెండేండ్ల నుంచి శ్రమిస్తున్నా. ఎట్టకేలకు 100 పర్సంటైల్ స్కోర్ పొందడం ద్వారా నా కల నిజమైంది. ప్రిపరేషన్‌కు ఆటంకం కలుగొద్దని సోషల్ మీడియాను దూరం పెట్టా. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు కుటుంబంతో గడిపేవాడిని. ఆరు బయట గడపడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకున్నా. ఆటలాడే వాడిని. ప్రస్తుతం నా ఫోకస్ అంతా జేఈఈ అడ్వాన్స్డ్పైనే. అడ్వాన్స్‌డ్‌లో మంచి స్కోర్ సాధించి ఐఐటీ బాంబేలో చేరాలన్నదే నా టార్గెట్. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కోర్సులో అడ్మిషన్ పొందాలన్న లక్ష్యంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నా. ప్రిపరేషన్ కోసం కాలేజీ అధ్యాపకుల సూచనలు, మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడ్డాయి.
– వివాన్ శరద్ మహీశ్వరి