ఖమ్మం రూరల్, ఏప్రిల్ 11 : రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతులు సంపూర్ణ ఆరోగ్యం సాధించాలని కోరుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని కాచిరాజుగూడెంలో శుక్రవారం ఆంధ్రాబ్యాంక్ కర్షక సేవా సహకార సంఘం టేకులపల్లి సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సొసైటీ చైర్మన్ బిరెడ్డి నాగచంద్రారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.కళావతి బాయ్, జిల్లా సహకార అధికారి గంగాధర్‌తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్‌కు సొసైటీ సీఈఓ శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఎస్.కుమార్, తాసీల్దార్ శ్రీ రాంప్రసాద్ ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ రైతులు, రైతు కుటుంబీకులను ఉద్దేశించి మాట్లాడారు.
నిత్యం సాగు పనులు చేసే రైతులు చాలావరకు ఆరోగ్యంగా ఉంటారన్నారు. అయితే రైతులు సాగు పనులతో పాటు సంపూర్ణ ఆరోగ్యంపై సైతం దృష్టి సారించాలని సూచించారు. రైతులు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టే యావత్ యంత్రాంగం, సమాజం సాఫీగా పాలన కొనసాగించడం జరుగుతుందన్నారు. రైతులకు అండగా ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం ఉందని భరోసా కల్పించారు. ఎలాంటి సమస్యలు ఉన్న స్థానిక పంచాయతీ సెక్రెటరీ మొదలుకుని జిల్లా కలెక్టర్ వరకు కలవవచ్చని తెలిపారు. రైతులు దురలవాట్లకు దూరంగా ఉండాలని తద్వారా సంపూర్ణ ఆరోగ్యం అందుతుందన్నారు. మన అలవాట్లను బట్టి పిల్లలు తయారవుతారని, మంచి అలవాట్లు అలవర్చుకోవడం వల్ల పిల్లలు క్రమశిక్షణ గల భావి పౌరులుగా తయారవుతారన్నారు.
రైతులకు అవసరమైన పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు అందించడంతో పాటు వారి సంపూర్ణ ఆరోగ్యంపై దృష్టి సారించి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం పట్ల సొసైటీ చైర్మన్, నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు. అలాగే వైద్యులను, వైద్య ఆరోగ్య సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. అనంతరం రోగులకు మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఏఓ ఉమ నగేశ్, ఎంపీఓ శ్రీదేవితో పాటు ఆయా శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.
Health Camp for Farmers : రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది : ఖమ్మం కలెక్టర్ ముజమిల్ ఖాన్