Rohit Sharma : ఐపీఎల్ 18వ సీజన్ మధ్యలో టెస్టులకు వీడ్కోలు పలికి అందర్నీ షాక్‌కు గురి చేశాడు రోహిత్ శర్మ (Rohit Sharma). ఇప్పటికే టీ20లకు గుడ్ బై చెప్పిన హిట్‌మ్యాన్ ఇకపై వన్డేల్లో మాత్రమే టీమిండియా జెర్సీ వేసుకోనున్నాడు. తన రిటైర్మెంట్ నిర్ణయంతో వార్తల్లో నిలిచిన రోహిత్.. భారత కామెంటేటర్లపై విరుచుకుపడ్డాడు. ఇప్పట్లో కామెంటేటరీ అనేది విమర్శించడానికే పరిమితం అవుతుందని భారత సారథి మండిపడ్డాడు.
ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు కామెంటేటర్లు, మీడియా రంగంలో చాలా మార్పులు వచ్చాయని రోహిత్ అభిప్రాయ పడ్డాడు. విమల్ కుమార్ అనే యూట్యూబర్‌తో మాట్లాడిన హిట్‌మ్యాన్.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత మీడియా అంతా స్టార్ ఆటగాళ్ల చుట్టూనే తిరుగుతుంది. కామెంటేటర్లు అయితే.. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తుంటారు. ‘ప్రస్తుతం ఉన్న కామెంటేటర్లలో చాలామందికి క్రికెట్ తెలియదు. కానీ, వివాదాలు, విమర్శలకు తెరతీయడంలో మాత్రం ఆరితేరారు. జర్నలిజం(Journalism)లో కూడా విలువలు తగ్గిపోయాయి. ఇంతకుముందు క్రికెట్ చుట్టూనే కథనాలు, విశ్లేషణలు ఉండేవి. కానీ, ఇప్పుడలా కాదు. సంచలన కథనాల పేరుతో వీక్షణలు, లైక్స్ సంపాదించడం.. ఎక్కువమంది మీ స్టోరీలు చదివించేలా చేయడం మాత్రమే లక్ష్యంగా మారింది.
Countless memories, magnificent moments.
Thank you, Captain 🫡🫡#RohitSharma pic.twitter.com/l6cudgyaZC
— BCCI (@BCCI) May 7, 2025
చాలా కొంతవరకే క్రికెట్ గురించి మాట్లాడుతున్నారు. అయితే.. వ్యూహాలను విశ్లేషించిండం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. మ్యాచ్ ఉన్నప్పుడు టీవీ చూస్తాం. అప్పుడు కామెంటేటర్లు ఏం చెబుతున్నారో ఆసక్తిగా వింటాం. ఆస్ట్రేలియాలో అయితే.. వాళ్ల కామెంటరీ అర్థవంతంగా ఉంటుంది. కానీ, మనదగ్గర అలా కాదు. మనదేశంలో క్రికెట్ గురించి లోతుగా తెలుసుకునేవాళ్లకు మసాలా ఎందుకు?’ అని రోహిత్ వివరించాడు. హిట్‌మ్యాన్ ఒక్కడే కాదు గతంలో విరాట్ కోహ్లీ(Virat Kohli) సైతం భారత కామెంటేటర్ల తీరును విమర్శించాడు.
కోహ్లీ నుంచి టెస్టు పగ్గాలు చేపట్టిన రోహిత్ జట్టును అద్భుతంగా నడిపించాడు. అతడి నేతృత్వంలో అదరగొట్టిన భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి రెండోసారి రన్నరప్‌గా సరిపెట్టుకుంది. అయితే.. నిరుడు స్వదేశంలో న్యూజిలాండ్ ధాటికి టీమిండియా వైట్‌వాష్‌కు గురైంది.
A memorable chapter in whites comes to a close for Rohit Sharma 👏🤍 pic.twitter.com/kCRKDeoX8q
— ICC (@ICC) May 7, 2025
ఆస్ట్రేలియా పర్యటనలోనూ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. కెప్టెన్‌గా, ఆటగాడిగా రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో, జూన్‌లో జరగబోయే ఇంగ్లండ్ పర్యటనకు అతడిని తప్పిస్తారనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే రోహిత్.. వీడ్కోలు పలికాడు. ఈ డాషింగ్ బ్యాటర్ కెప్టెన్సీలో ఇండియా 24 టెస్టుల్లో 12 విజయాలు నమోదు చేసింది.