Skin Wrinkles | వయస్సు మీద పడుతున్న కొద్దీ సాధారణంగా ఎవరికైనా సరే ముఖంపై ముడతలు ఏర్పడుతుంటాయి. ఇది సహజమే. వయస్సు పెరిగే కొద్దీ చర్మం తన సహజ సాగే గుణాన్ని కోల్పోతుంది. దీంతో ముఖంపైనే కాదు శరీరంలో ఇతర చోట్ల కూడా ముడతలు వస్తాయి. అయితే కొందరికి వృద్ధాప్యం రాకపోయినా సరే యుక్త వయస్సులో ఉన్నప్పటికీ ముఖం ముడతలు పడినట్లు కనిపిస్తుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉండడం, సరైన టైముకు భోజనం చేయకపోవడం, పోషకాహార లోపం, మద్యం ఎక్కువగా సేవించడం, పొగ తాగడం, రాత్రి పూట ఆలస్యంగా నిద్రించడం, థైరాయిడ్, డయాబెటిస్ వంటి అంశాల వల్ల చాలా మందికి యుక్త వయస్సులోనే ముఖంపై ముడతలు వస్తుంటాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే ఈ ముడతలను తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
ముఖంపై ఏర్పడే ముడతలతోపాటు మొటిమలు, మచ్చలను తగ్గించడంలో కొబ్బరినూనె అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చర్మానికి సహజసిద్ధమైన తేమను అందిస్తుంది. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. పొడిబారడం తగ్గుతుంది. ముఖంపై ఉండే ముడతలు తగ్గిపోతాయి. కొబ్బరినూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ఫలితంగా ముడతలు తగ్గిపోతాయి. కొద్దిగా కొబ్బరినూనెను తీసుకుని వేడి చేసి ముఖం, మెడ, మోచేతులపై రాయాలి. రాత్రి పూట ఇలా చేసి ఉదయం కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే కచ్చితంగా ఫలితం ఉంటుంది. కొబ్బరినూనెకు బదులుగా మీరు ఆలివ్ ఆయిల్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఈ నూనెలోనూ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగానే ఉంటాయి. ఇవి తేమను అందిస్తాయి. ముఖంపై ఉండే ముడతలను తగ్గిస్తాయి.
చర్మానికి మేలు చేయడంలో కలబంద ఎంతగానో పనిచేస్తుంది. కలబందలో చర్మాన్ని సంరక్షించే గుణాలు ఉంటాయి. ఇది చర్మం సాగే గుణాన్ని పెంచుతుంది. దీంతో ముఖంపై ఉండే ముడతలు తగ్గిపోతాయి. కొద్దిగా తాజా కలబంద గుజ్జును తీసుకుని ముఖానికి నేరుగా అప్లై చేయాలి. 20 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే ఫలితం ఉంటుంది. అరటి పండుతో ఫేస్ మాస్క్ వేసి కూడా ఉపయోగించవచ్చు. అరటి పండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మం సాగే గుణాన్ని పెంచుతాయి. దీని వల్ల ముడతలు తగ్గిపోతాయి. కొద్దిగా అరటి పండును నలిపి ముఖానికి నేరుగా అప్లై చేయాలి. 20 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. అవసరం అయితే అందులో కాస్త తేనె లేదా పెరుగు కలిపి రాసుకోవచ్చు. ఇలా చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. ముడతలు, మచ్చలు పోతాయి.
తేనె చర్మానికి సహజసిద్ధమైన తేమను అందిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. తేనె యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. దీని వల్ల చర్మానికి మేలు జరుగుతుంది. కొద్దిగా తేనెను తీసుకుని నేరుగా ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. రోజూ ఇలా చేస్తుంటే ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. బొప్పాయి పండ్లలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చర్మంపై ఉండే మృత కణాలను తొలగిస్తుంది. చర్మానికి సహజసిద్ధమైన కాంతిని తెస్తుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలను తొలగిస్తుంది. బొప్పాయి పండు గుజ్జును నేరుగా ముఖానికి రాస్తుంటే ఫలితం ఉంటుంది. ఇలా పలు ఇంటి చిట్కాలను పాటిస్తే కచ్చితంగా ముఖంపై ఉండే ముడతలు పోయి వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. ముఖం సహజసిద్ధమైన కాంతిని పొందుతుంది.