న్యూఢిల్లీ: తమ సహనాన్ని పరీక్షించ వద్దని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. దానిని అలుసుగా తీసుకుంటే తీవ్ర ప్రతిస్పందనకు సిద్ధంగా ఉండాలని పాకిస్థాన్‌ను హెచ్చరించారు. పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతిస్పందనగా భారత్‌లోని 15 సైనిక టార్గెట్లను ఆ దేశం లక్ష్యంగా చేసుకున్నది. అయితే భారత్ ధీటుగా బదులిచ్చింది. పాక్ దాడులను తిప్పికొట్టింది. అలాగే లాహోర్‌లోని రాడార్, రక్షణ వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసింది.
కాగా, ఈ పరిణామాలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం స్పందించారు. భారత్ సహనాన్ని పరీక్షించవద్దని పాకిస్థాన్‌కు హెచ్చరించారు. ‘మేం ఎప్పుడూ బాధ్యతాయుతమైన దేశంగా చాలా సంయమనంతో వ్యవహరించాం. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడాన్ని మేం నమ్ముతాం. కానీ దీని అర్థం ఎవరైనా మా సహనాన్ని దుర్వినియోగం చేయవచ్చని కాదు. ఎవరైనా దానిని అనవసరంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తే, వారు నిన్నటి (ఆపరేషన్ సిందూర్) మాదిరిగా ‘నాణ్యమైన ప్రతిస్పందన’ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి’ అని పాక్‌కు వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు మన సాయుధ దళాలు ప్రదర్శించిన ధైర్యానికి వారిని అభినందిస్తున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ మరోసారి అన్నారు. పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను సైనిక దళాలు నాశనం చేసిన విధానం మనందరికీ గర్వకారణమని ప్రశంసించారు.