Rohit Sharma : పొట్టి ప్రపంచ కప్ ట్రోఫీతో పాటు భారీ ప్రైజ్‌మనీ అందుకున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి వార్తల్లో నిలిచాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన రూ. 5 కోట్ల బోనస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) మాదిరిగానే తనకు లభించనున్న 5 కోట్లను హిట్‌మ్యాన్ సున్నితంగా తిరస్కరించాడు.
బీసీసీఐ ఆఫర్ చేసిన రూ. 5 కోట్ల బోనస్‌ను టీమిండియా సహాయక సిబ్బందికి ఇవ్వాలని రోహిత్ శర్మ భావిస్తున్నాడట. అందరికీ డబ్బులు సమానంగా రావాలనే ఉద్దేశంతోనే రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.
కరీబియన్ గడ్డపై టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. రోహిత్ సేన స్వదేశం రాగానే ఓపెన్ టాప్ బస్సులో విక్టరీ పరేడ్ అనంతరం.. వాంఖడే స్టేడియంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రెటరీ జై షాలు రూ.125 కోట్ల ప్రైజ్‌మనీని భారత క్రికెటర్లకు అందించారు. అనంతరం ఆ డబ్బును వరల్డ్ స్క్వాడ్‌తో పాటు రిజర్వ్ ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి తలా కొంత ఇవ్వాలని నిర్ణయించారు.
ప్రపంచ కప్ బృందంలోని 15 మందికి, హెడ్‌కోచ్ ద్రవిడ్‌కు రూ. 5 కోట్ల చొప్పున.. సహాయక సిబ్బంది అయిన విక్రమ్ రాథోర్(బ్యాటింగ్ కోచ్),పరాస్ మాంబ్రే( బౌలింగ్ కోచ్ ), టి. దిలీప్(ఫీల్డింగ్ కోచ్ )లకు తలా రూ.2.5 కోట్లు కేటాయించారు. అయితే.. ద్రవిడ్ మాత్రం తనకు తన బృందానికి ఇచ్చినట్టే రూ. 2.5 కోట్లు చాలని బీసీసీఐకి తెలిపాడు. దాంతో, అందరూ ‘ది వాల్’ హుందాతనాన్ని మరోసారి ప్రశంసిస్తూ అతడిని ఆకాశానికెత్తేశారు. ఇప్పుడు కెప్టెన్ రోహిత్ సైతం తనకు రూ.5 కోట్ల బోనస్ అవసరం లేదని.. జట్టు విజయంలో భాగమైన సిబ్బందికి ఆ మొత్తాన్ని ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడు.