Rohit Sharma | ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగనున్నది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించగా.. న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ రేసులోకి వచ్చింది. 25 సంవత్సరాల తర్వాత.. మరోసారి ఈ రెండు జట్లు ఐసీసీ పరిమిత ఓవర్ల ఫార్మాట్ టైటిల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్ తర్వాత.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఫార్మాట్లో తన భవిష్యత్ గురించి భారీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.
చాలాకాలం పాటు నైపుణ్యం కలిగిన బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా భారత జట్టుకు సేవలందించిన రోహిత్ శర్మకు ఇది చివరి పరిమిత ఓవర్ల ఐసీసీ టోర్నమెంట్ అయ్యే అవకాశం ఉన్నది. ఈ టైటిల్ రేసులో టీమిండియా బలమైన పోటీదారుగా నిలుస్తున్నది. హిట్‌మన్ నాయకత్వంలో ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అజేయంగా నిలిచింది. భారత్ ట్రోఫీని గెలుచుకోవడంలో విజయం సాధిస్తే.. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత.. హిట్‌మన్ ఒకటి కంటే ఎక్కువ ఐసీసీ టోర్నమెంట్లను గెలుచుకున్న రెండో భారత కెప్టెన్‌గా నిలువనున్నాడు.
రోహిత్ నాయకత్వంలో గత సంవత్సరం వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచ కప్‌ను టీమిండియా గెలిచింది. ఆ తర్వాత రోహిత్, విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ మరోసారి వన్డేల్లో అదే తరహా నిర్ణయం తీసుకోవచ్చని.. మ్యాచ్ ఫలితంపై ఎలాంటి ప్రభావం ఉండదని ఊహాగానాలు వస్తున్నాయి. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత.. రోహిత్ శర్మ వన్డేల్లో తన భవిష్యత్‌పై సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్‌తో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు పలు జాతీయ మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
భారత్ క్రికెట్లో సెలెక్టర్లు కీలక ఆటగాళ్ల భవిష్యత్‌పై నిర్ణయం తీసుకోరని.. బదులుగా ఆటగాళ్లే దాని గురించి బోర్డు ఉన్నతాధికారులతో మాట్లాడుతారని నివేదిక పేర్కొంది. భారతదేశం ఛాంపియన్స్ ట్రోఫీని గెలిస్తే.. కెప్టెన్ రోహిత్ తన రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉన్నది. రిటైర్మెంట్కు సంబంధించిన ప్రశ్నలను నివారించేందుకే ఫైనల్‌కు ముందు విలేకరుల సమావేశానికి రాలేదని ఊహాగానాలున్నాయి. రోహిత్ శర్మ స్థానంలో విలేకరుల సమావేశానికి వచ్చిన వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ విలేకరులనుద్దేశించి మాట్లాడాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏ ఆటగాడి రిటైర్మెంట్ గురించి చర్చ జరగడం లేదని క్లారిటీ ఇచ్చాడు.
శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. తాము రోహిత్ రిటైర్మెంట్ గురించి మాట్లాడలేదని తెలిపారు. తమ చర్చలన్నీ మ్యాచ్ గెలవడం గురించే జరిగాయని, తాము ఫైనల్ గెలవాలని పేర్కొన్నాడు. రోహిత్ గురించి తనతో కాదని.. జట్టుతో చర్చించాడని.. హిట్‌మ్యాన్ కూడా ఫైనల్ గెలవడం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడని తాను అనుకుంటున్నట్లు తెలిపాడు. వైస్ కెప్టెన్ గిల్ మాట్లాడుతూ.. రోహిత్ మొదట ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడంపై దృష్టి పెడుతున్నాడని తాను అనుకుంటున్నానని.. మ్యాచ్ ముగిసిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ కోసం ఉత్సాహంగా ఉన్నానని.. గతంలో తాము వరల్డ్ కప్ గెలువలేకపోయామని.. కానీ, ఈ సారి అలా జరుగనివ్వమని చెప్పాడు.
ఓ జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి వన్డేల నుంచి రిటైర్కాకపోవచ్చని పేర్కొంది. టీ20 ప్రపంచకప్ తర్వాత విరాట్, రోహిత్ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ ఫార్మాట్లో అంతర్జాతీయ స్థాయిలో సాధించాల్సింది ఇంకా ఏమీ మిగలలేదు. ఇక మిగతా ఫార్మాట్ల విషయానికి వస్తే.. టెస్టుల్లో 10వేల పరుగులు పూర్తి చేయాలని కోహ్లీ చూస్తున్నాడు. విరాట్ సమకాలిక బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్ ఇప్పటికే ఈ ఘనత సాధించారు. టెస్ట్ క్రికెటర్‌గా.. కోహ్లీ మరికొంతకాలం ఆడడం ఖాయంగా కనిపిస్తుంది. కానీ, ఆస్ట్రేలియా పర్యటనలో మంచి ఫామ్‌లో లేకపోవడంతో సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ నుంచి తప్పుకున్న రోహిత్ విషయంలోనూ అలాగే జరగవచ్చని చెప్పలేం.
రోహిత్ వన్డేల నుంచి రిటైర్ అయి టెస్ట్ క్రికెట్లో కొనసాగుతాడా? లేదా ? స్వదేశంలో వన్డేలు ఆడి వీడ్కోలు పలుకుతాడా? అన్నది భవిష్యత్‌లో తేలనున్నది. టీమిండియా త్వరలో ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడనున్నది. టీమిండియా ఎఫ్‌టీపీని పరిశీలిస్తే.. డిసెంబర్‌కు ముందు భారత జట్టు ఎక్కువ వన్డేలు ఆడబోవడం లేదు. కేవలం బంగ్లాదేశ్‌తో వన్డే, శ్రీలంకలో జరిగే ఆసియాకప్, ఆస్ట్రేలియాతో మూడు మ్యాచుల సిరీస్ ఆడనున్నది. ఈ ఏడాది మార్చి 9 తర్వాత.. డిసెంబర్ మధ్య ఇవే సిరీస్‌లు జరుగనున్నాయి. 2027లో జరిగే వన్డే ప్రపంచ కప్ వరకు తాను జట్టులో ఉండాలని రోహిత్ అనుకుంటున్నాడా? లేదా? ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఈ ఫార్మాట్లో ఆడడం కొనసాగిస్తాడా? ఈ ప్రశ్నకు సమాధానం ఆదివారం చాలా స్పష్టంగా తెలియనున్నది.