Champions Trophy Final | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు సమయం దగ్గరపడింది. ఈ నెల 9న దుబాయిలోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ జరుగనున్నది. ఫైనల్లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. గ్రూప్ దశలో న్యూజిలాండ్‌ను ఓడించిన టీమిండియా.. ఫైనల్లోనూ అదే జట్టును ఢీకొట్టబోతున్నది. సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై భారీ స్కోర్ సాధించి ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫైనల్లో భారత్-న్యూజిలాండ్ జట్ల బలాబలాలను పరిశీలిద్దాం..!
టీమిండియా సెమీస్‌లో స్టివ్ స్మిత్ నేతృత్వంలోని జట్టును ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఇక దక్షిణాఫ్రికాను మట్టికరిపించి ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు భారత్, కివీ జట్లు చాంపియన్స్ ట్రోఫీ ఎవరిదో తేల్చుకోనున్నాయి. గ్రూప్ దశలో రోహిత్ సేన విధించిన 249 స్వల్ప పరుగుల లక్ష్యాన్ని కివీ జట్టు ఛేదించలేకపోయింది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ధాటికి న్యూజిలాండ్ కుప్పకూలింది. 205 పరుగులకే ఆలౌట్.. 44 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే, సెమీస్‌లో ప్రొటీస్ జట్టుపై చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే తొలిసారిగా 362 పరుగుల భారీ స్కోర్‌ని సాధించింది.
న్యూజిలాండ్ జట్టు ఫైనల్లో భారత్‌ను ఎలా కట్టడి చేస్తుందో చూడాల్సిందే. శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ ఇలా భారత బ్యాటర్లను ఎలా కళ్లెం వేస్తుందో చూడాల్సిందే. అలాగే, షమీ, జడేజా, వరుణ్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటారో ఆసక్తికరంగా మారింది. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ దక్షిణాఫ్రికాపై సెంచరీలతో చెలరేగగా.. మళ్లీ వీరు చెలరేగకుండా తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌కు పంపేందుకు టీమిండియా ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మైదానంలో న్యూజిలాండ్ ఫీల్డింగ్ అద్భుతం. భారత్‌కు అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యం ఉంది. అయితే, ఈ విషయంలో టీమిండియాపై న్యూజిలాండ్‌దే అధిపత్యమని క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు.
ఇక ఇప్పటి వరకు భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డేలు, ఐసీసీ టోర్నీలు, చాంపియన్స్ ట్రోఫీలో రికార్డుల విషయానికి వస్తే.. మొత్తం 12 ఐసీసీ వన్డేలు జరిగాయి. ఇందులో భారత్, న్యూజిలాండ్ చెరో ఆరు మ్యాచుల్లో గెలిచాయి. ఇక రెండు జట్ల మధ్య మొత్తం 119 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 61 మ్యాచులు నెగ్గగా.. న్యూజిలాండ్ 50 మ్యాచ్‌లలో గెలిచింది. ఒకటి టైగా ముగియగా.. మరో ఏడు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. ఇక చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రెండు జట్లు పోటీపడడం ఇది రెండోసారి కావడం విశేషం. 2000లో నైరోబీలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని భారత జట్టుపై ఫ్లెమింగ్ నాయకత్వంలోని జట్టు జయకేతనం ఎగుర వేసింది.
ఈ మ్యాచ్‌కు టీమిండియా పూర్తిగా సిద్ధమైంది. మొన్నటి వరకు ఫామ్ లేమితో ఇబ్బందిపడ్డ సీనియర్ ఆటగాళ్లు మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాట్‌తో అలరిస్తున్నారు. రోహిత్ శర్మ శుభారంభాన్ని అందిస్తున్నా.. దాన్ని బిగ్ స్కోర్‌గా మలచడంలో విఫలమవుతున్నాడు. ఇక విరాట్ కోహ్లీ పాక్‌పై సెంచరీతో మునుపటి ఫామ్‌ను అందుకున్నాడు. సెమీస్‌లోనూ 80కిపైగా పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. అలాగే, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ సైతం ఫామ్‌లో ఉన్నారు. ఇక బౌలింగ్‌లో మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జడేజా అద్భుతంగా రాణిస్తున్నారు. చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు అన్ని మ్యాచులు దుబాయిలోనే ఆడడం కాస్త కలిసిరానున్నది. ఇక న్యూజిలాండ్ సైతం అన్ని విభాగాల్లో మెరుగ్గానే ఉన్నది. చాంపియన్స్ ట్రోఫీలో ఒక్క భారత్‌పైనే ఓటమిపాలైంది. ఫైనల్లో ఎలాగైనా గెలవాలనే కసితో ఉన్నది. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ ఆకట్టుకుంటున్నది.