న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: పాత సినిమాల్లో చూపించినట్టుగా రాజస్థాన్‌లోని ఒక వ్యాపారి ఇంట్లో రహస్య గోడ, దాని వెనుక రూ.కోట్లు విలువ చేసే బంగారమున్న స్ట్రాంగ్ రూమ్ బయటపడింది. ఇదంతా చూసి ఐటీ సోదాలకు వెళ్లిన అధికారులు విస్తుపోయారు. రూ.100 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణల్లో భాగంగా కన్హా గ్రూప్ కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ప్రముఖ ఆహార, పానీయాల విక్రయ సంస్థ కన్హా గ్రూప్‌పై పన్ను ఎగవేత ఆరోపణలు రావటంతో మూడు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
మొత్తం ఆరు నగరాల్లో 33 ప్రాంతాల్లో బుధవారం నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. తొలి రెండు రోజుల్లో గ్రూప్ యజమాని ఇల్లు, ఆఫీస్‌లో అనుమానాస్పద దస్ర్తాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక మూడో రోజు సోదాల్లో వారికి రహస్య గోడ కనిపించింది. దాన్ని బద్దలు కొట్టి చూడగా, వెనుక ఒక గది ఉంది. దాంట్లో కోట్ల రూపాయల విలువ చేసే బంగారు నగలు ఉన్నాయి. ఇప్పుడు ఆ మొత్తాన్ని లెక్కిస్తున్నారు.