Roger Federer : ప్రపంచ టెన్నిస్‌ను రెండు దశాబ్దాల పాటు ఏలిన రోజర్ ఫెదరర్ (Roger Federer) ఆటే కాదు జీవితమూ స్ఫూర్తిదాయకమే. తన సొగసైన ఆటతో దిగ్గజంగా పేరొందిన ఫెదరర్ మళ్లీ అభిమానుల ముందుకు వచ్చాడు. ఈసారి అతడు కోర్టులో రాకెట్ పట్టుకొని రాలేదు. తన కెరీర్‌లోని చివరి 12 రోజులు ఎలా గడిచాయో చెప్పడానికి వచ్చేశాడు.
అవును.. రెండేండ్ల క్రితం ఆటకు వీడ్కోలు పలికిన ఫెదరర్‌పై అమెజాన్ ప్రైమ్ రూపొందించిన ‘ఫెదరర్ ట్వల్ ఫైనల్ డేస్'(Federer : Twelve Final Days) డాక్యుమెంటరీ విడుదలైంది. ఈ సందర్భంగా లండన్ టవర్ బ్రిడ్జి (Tower Bridge)పై ఈ లెజెండరీ ఆటగాడి డాక్యుమెంటరీని ఆవిష్కరించారు. ఫెదరర్ జీవితంలోని అద్భుత క్షణాలను డిస్ప్లేపై ప్రదర్శించారు. విద్యుత్ కాంతుల వెలుగులో ఫెదరర్ విజయ ప్రస్థానాన్ని చూసిన అభిమానులు సంతోషం పట్టలేకపోయారు.
Roger Federer playing tennis with a younger version of himself on Tower Bridge in London.
One of the most iconic promos I’ve ever seen. ❤️
pic.twitter.com/lRd0io7700— The Tennis Letter (@TheTennisLetter) June 19, 2024
తన డాక్యుమెంటరీ ప్రమోషన్లో భాగంగా ఫెదరర్ ఈమధ్య పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఒక ఆటగాడి తన కెరీర్‌కు వీడ్కోలు పలకడం అనేది ఓరకంగా అంతిమ యాత్ర లాంటిది. అదొక గొప్ప ఫీలింగ్. మీరు పూర్తిగా స్పృహతోనే ఉంటారు. కానీ, అప్పుడు జరుగుతన్నవన్నీ స్లో మోషన్లో మసకగా మసకగా అనిపిస్తాయి’ అని ఫెదరర్ అన్నాడు.
స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెదరర్ టెన్నిస్‌పై చెరగని ముద్ర వేశాడు. ‘గ్రాస్ కోర్టు కింగ్’గా ఓ వెలుగు వెలిగాడు. అయితే.. రఫెల్ నాదల్ (Rafael Nadal), నొవాక్ జకోవిచ్, ఆండీ ముర్రేలు ఎంట్రీ ఇవ్వడంతో ఫెదరర్ ఏకఛక్రాధిపత్యానికి చెక్ పడింది. చివరకు 2022లో లావెర్ కప్ (Laver Cup) అనంతరం కన్నీటిపర్యంతమవుతూ తనకెంతో ఇష్టమైన ఆటకు ఫెదరర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అక్కడితో టెన్నిస్‌లో ఓ శకం ముగిసిపోయింది. కెరీర్లో 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు కొల్లగొట్టిన ఫెదరర్ అత్యధిక ట్రోఫీ వీరుల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్(24), రఫెల్ నాదల్(22)లు ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నారు.