అమరావతి : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండల వద్ద ఓఎన్జీసీ బావిలో చెలరేగిన మంటలు ( ONGC Fire ) ఇంకా అదుపులోకి రాలేదు. మంటలను ఆర్పేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సాంకేతిక నిపుణుల ప్రయత్నాలు ఫలించలేదు.
బుధవారం మూడో రోజు కూడా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. అగ్నిమాపక యంత్రాలతో నిరంతరం నీటిని విరజిమ్మే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. మంటలు పూర్తిగా ఆర్పేందుకు మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశముందని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. కాగా బ్లోఅవుట్ ప్రాంతానికి వెళ్లేందుకు అత్యవసర రహదారి ఏర్పాటుకు ప్రభుత్వం రూ. 8 లక్షలు మంజూరు చేసింది.
మంటల వల్ల కిలోమీటర్ దూరం వరకు ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లి అధికారులు ఇంటింటా సర్వే నిర్వహించేందుకు ప్రత్యేక బృందాల నియమించారు. ఇందులో భాగంగా వ్యవసాయ అధికారులతో ఇరుసుమండలో పంట నష్టం అంచనా వేస్తున్నారు. మరోవైపు పరిసర ప్రాంతాల్లో నీరు, గాలి కాలుష్యాన్ని కాలుష్య నియంత్రణ అధికారులు పరిశీలించారు. నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు హరీష్(MP Harish Visit) బుధవారం బ్లోఅవుట్ ప్రాంతాన్ని పరిశీలించారు .