హైదరాబాద్ : హుస్సేన్ సాగర్‌లో సికింద్రాబాద్ క్లబ్ టిస్కాన్ యూత్ ఓపెన్ రెగెట్టా (Youth Open Regetta) పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. రెండోరోజు పోటీల్లో ఆప్టిమిస్ట్ మెయిన్ ఫ్లీట్ విభాగంలో ఎన్వైఎస్సీ టీమ్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆరు రేసుల్లో 10 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు రిజ్వాన్. టీఎస్‌సీకి చెందిన బొంగూర్ బన్నీ రెండో స్థానం, ఆర్‌ఎంవైసీ తరఫున పోటీపడిన కృష్ణా వెంకటాచలం మూడో స్థానం దక్కించుకున్నారు.
బాలికల విభాగంలో సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్‌కు చెందిన శ్రింగేరి రాయ్ (Shringeri Roy) తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఓవరాల్‌గా అగ్రస్థానంలో ఉంది. ఐఎల్సీయే బాలుర కేటగిరీలో ఎన్వైఎస్సీకి చెందిన రమాకాంత్ సత్తా చాటాడు. ఆరు రేసుల్లో 19 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. బాలికల విభాగంలో ఆస్థా పాండే ముందంజలో ఉంది.
వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తొలిరోజు వాయిదా పడిన ఆప్టిమిస్ట్ గ్రీన్ ఫ్లీట్ కేటగిరీ రెండో రోజు జరిగింది. 36 మంది యువ సెయిలర్లు పోటీపడగా.. టీఎస్‌సీకి చెందిన యువరాజ్ అగ్రస్థానం సాధించాడు. అటు బాలికల విభాగంలో సీఈఎస్సీకి చెందిన సోనియా బ్రార్ సత్తా చాటింది.