Domestic Season : దేశవాళీ క్రికెట్ పండుగకు మరో ఇరవై రోజుల్లో తెరలేవనుంది. ఆగస్టు చివరి వారంలో బెంగళూరు వేదికగా దులీప్ ట్రోఫీ (Duleep Trophy)తో డొమెస్టిక్ సీజన్ 2025-26 ప్రారంభం కానుంది. ఆ వెంటనే టీ20 ఫార్మాట్లో జరుగబోయే ఇరానీ కప్ (Irani Cup) మ్యాచ్‌లకు నాగ్‌పూర్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈసారి టీమిండియా స్టార్ తిలక్ వర్మ సారథిగా తన తడాఖా చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంటర్ జోన్ ఫార్మాట్లో జరుగనున్న దులీప్ ట్రోఫీలో తిలక్ సౌత్ జోన్ జట్టును నడిపించనున్నాడు.
దులీప్ ట్రోఫీ ఇంటర్ జోన్ ఫార్మాట్లో జరుగనున్న దులీప్ ట్రోఫీఆగస్టు 18న మొదలై సెప్టెంబర్ 15న ముగుస్తుంది. బీసీసీఐ కొత్తగా నిర్మించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. టైటిల్ కోసం ఆరుజట్లు కాచుకొని ఉన్నాయి. సౌత్ జోన్, సెంట్రల్ జోన్, వెస్ట్ జోన్, ఉత్తర జోన్, తూర్పు జోన్, ఈశాన్య జోన్ టీమ్స్ తలపడనున్నాయి. వీటిలో సౌత్, వెస్ట్ జోన్ జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. ఆగస్ట్ 28నార్త్, ఈస్ట్ మధ్య ఆగస్టు 31న సెంట్రల్, ఈశాన్య జోన్ల మధ్య క్వార్టర్ ఫైనల్ ఫైట్ జరుగనుంది. సెప్టెంబర్ 4 నుంచి 7వ తేదీ వరకూ సెమీఫైనల్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 11న జరిగే ఫైనల్‌తో టైటిల్ విజేత ఎవరో తేలిపోనుంది.
దులీప్ ట్రోఫీ తర్వాత నాగ్‌పూర్ వేదికగా ఇరానీకప్ జరుగనుంది. గత సీజన్ రంజీ విజేత విదర్భ, రెస్ట్ ఆఫ్ ఇండియాను ఢీకొననుంది. అయితే.. నిరుడు విదర్భ తరఫున పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్ ఈసారి ఆడతాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఈమధ్యే అతడు సొంత జట్టు కర్నాటకకు మారాడు. కానీ, సౌత్ జోన్ సెలెక్టర్లు మాత్రం కరుణ్‌ను దులీప్ ట్రోఫీ స్క్వాడ్‌లోకి తీసుకోలేదు.
Tilak Varma set to lead South Zone in the upcoming Duleep Trophy 🏆🏏 pic.twitter.com/o3v64MoYz7
— CricketGully (@thecricketgully) July 28, 2025
దాంతో, ఈ స్టార్ ప్లేయర్ ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఆడడంపై అనిశ్చితి నెలకొంది. మరో విషయం.. యువ పేసర్ రసిక్ దార్ సలాం జమ్ముకశ్మీర్ జట్టును వీడాడు. బోర్డు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ రావడంతో ఈ స్పీడ్‌స్టర్ బరోడాకు మారాడు. ఇప్పటికే ఐపీఎల్ స్టార్ జితేశ్ శర్మ సైతం బరోడాకు ఆడేందుకు సిద్ధమయ్యాడు.