RK Roja | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఎలాంటి కుట్రలు చేస్తారో అని ఆందోళనగా ఉందని తెలిపారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో రోజా పాల్గొన్నారు.
అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. మామకే చెప్పులేసి, ఆయన పార్టీని లాక్కొని ప్రాణాలను తీసుకున్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. జగనన్న భద్రత విషయంలో ఆయనను నమ్మే పరిస్థితి లేదని తెలిపారు. జగన్‌కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించకుండానే.. కోర్టులకు, కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతుందని అన్నారు. జగన్ ఏ జిల్లాకు వెళ్లినా రైతులు, ప్రజలను కలిసిన సమయాల్లో అసలు భద్రతే కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జగనన్న భద్రత తమందరికీ ముఖ్యమని తెలిపారు. జగన్ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, ప్రజలు బాగుంటారని అన్నారు. అందుకే ఆయన భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. న్యాయస్థానాల్లోనూ పోరాటం చేస్తామని పేర్కొన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా జగనన్నకు భద్రత కల్పించేందుకు ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నామని చెప్పారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్లుగా ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం ముందుకెళ్తున్నారని రోజా సెల్వమణి అన్నారు. ఎమ్మెల్యే, మంత్రులు చెప్పినవారిపై పోలీసు అధికారులు తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కరోనా వచ్చినప్పుడే కూటమి నాయకులు హైదరాబాద్‌కు పారిపోయారని.. రేపు జగనన్న ముఖ్యమంత్రి అయితే కూటమి నాయకులంతా హైదరాబాద్‌కు కాదు.. అమెరికాకు పారిపోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. వీటన్నింటికీ అప్పుడు ప్రభుత్వ అధికారులే జవాబు చెప్పాల్సి ఉంటుందని అన్నారు.
సీనియర్లతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆర్కే రోజా అన్నారు. తప్పుడు కేసులు పెట్టేవారి వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా ఒక యాప్ రూపొందిస్తున్నామని తెలిపారు. ఆ యాప్‌లో అన్ని వివరాలు నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే వారందరికీ చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పారు. వైసీపీ కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు.