హనుమకొండ చౌరస్తా, జులై 29 : పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండలోని ప్రభుత్వ మర్కజి ఉన్నత పాఠశాల విద్యార్థులు కుమార్‌పల్లి వీధిలో ర్యాలీ నిర్వహించి, నాలుగు బాటల కూడలిలో తెలుగు భాషోపాధ్యాయులు వలస పైడి రచించి, దర్శకత్వం వహించిన ‘పొగాకు వాడొద్దు- తొందరగా సావద్దు’ అనే వీధి నాటకాన్ని ప్రదర్శించారు. పొగాకు తినడం, ధూమపానం చేయడం వలన కలిగే అనర్ధాలను తెలుపుతూ ర్యాలీ నిర్వహించడంలో భాగంగా ఈ వీధి నాటకాన్ని ప్రదర్శించి, ప్రజలకు పొగాకు వలన కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గుణాత్మక సెక్టోరియల్ అధికారి బద్దం సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ పొగాకు వాడకం వలన కలిగే నష్టాల గురించి సమాజాన్ని జాగృతం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవీ రామారావు మాట్లాడుతూ యువతను చెడుదారి పట్టించే అనేక పదార్థాలు నేడు అందుబాటులో ఉన్నాయని, అందులో పొగాకు వాడకం, సిగరెట్ తాగడం, తద్వారా డ్రగ్స్ వైపు మళ్లే అవకాశం ఉందన్నారు. నినాదాలతో సాగిన ఈ ర్యాలీలో పాఠశాల ఎన్సిసి ఆఫీసర్ కే.వాసు, ఎన్సిసి క్యాడేట్స్, ఉపాధ్యాయులు మధుసూదన్‌రెడ్డి, మనోహర్, కంది శ్రీనివాసరెడ్డి, వీరస్వామి, తుపాకుల లింగమూర్తి, కాంతయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.