Aloe Vera Juice | మన చుట్టూ ప్రకృతిలో అనేక రకాల మొక్కలు ఉంటాయి. వాటిల్లో ఔషధ గుణాలు ఉండే మొక్కలు చాలానే ఉన్నాయి. అలాంటి మొక్కల్లో కలబంద కూడా ఒకటి. కలబంద ఆకుల్లో ఉండే గుజ్జును సౌందర్య సాధన ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. అయితే కలబంద ఆకుల గుజ్జుతో తయారు చేసే కలబంద రసాన్ని మనం తాగవచ్చు. దీన్ని రోజూ ఉదయం తాగాల్సి ఉంటుంది. ఈ రసాన్ని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. కలబంద రసాన్ని సేవిస్తే పలు వ్యాధులు నయమవుతాయని అంటున్నారు. ఈ రసంలో అమైలేజ్, లైపేజ్ అనే ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి కొవ్వులు, పిండి పదార్థాలను జీర్ణం చేయడంలో సహాయం చేస్తాయి. దీంతో తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి ఏర్పడదు. అలాగే గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.
కలబందలో సహజసిద్ధమైన లాక్సేటివ్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ రసాన్ని తాగితే పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. దీంతో మలబద్దకం తగ్గుతుంది. కలబంద రసంలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. కనుక పేగులు, జీర్ణాశయంలో వచ్చే వాపులను తగ్గిస్తాయి. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రసాన్ని సేవిస్తుంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే సమస్య తగ్గుతుంది. అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే అల్సర్లు నయమవుతాయి. కలబంద రసం సహజసిద్ధమైన డిటాక్సిఫైర్ గా పనిచేస్తుంది. ఈ రసాన్ని తాగితే శరీరంలో ఉన్న వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. దీంతో శరీరం అంతర్గతంగా క్లీన్ అవుతుంది. ముఖ్యంగా లివర్, కిడ్నీలు క్లీన్ అవుతాయి. శరీర భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తాన్ని శుద్ధి చేసేందుకు కూడా కలబంద రసం పనిచేస్తుంది.
కలబంద రసంలో పాలీ శాకరైడ్స్ ఉంటాయి. ఇవి తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేస్తాయి. దీంతో శరీరం బ్యాక్టీరియా, వైరస్‌లపై పోరాడుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కలబంద రసంలో విటమిన్ సి కూడా అధికంగానే ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఈ రసంలో ఉండే జింక్ రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. కలబంద రసం సేవిస్తుంటే ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. కలబంద రసం చర్మానికి, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మానికి తేమ లభించేలా చేస్తాయి. దీంతో చర్మం పొడిబారకుండా ఉంటుంది. పొడి చర్మం ఉన్నవారికి ఈ రసం మేలు చేస్తుంది. ఈ రసంలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి కనుక చర్మంపై వచ్చే వాపులు తగ్గిపోతాయి.
కలబంద రసాన్ని తాగుతుంటే శిరోజాలకు బలం చేకూరుతుంది. శిరోజాలు ఒత్తుగా పెరుగుతాయి, దృఢంగా మారుతాయి. ఈ రసం తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునే వారు ఈ రసాన్ని రోజూ తాగుతుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. షుగర్ ఉన్నవారు ఈ రసాన్ని తాగితే షుగర్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఇలా కలబంద రసం మనకు ఎంతగానో మేలు చేస్తుంది. అయితే దీన్ని 15 నుంచి 20 ఎంఎల్ కన్నా ఎక్కువ మోతాదులో తాగకూడదు. కొందరికి అలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారు ఈ రసాన్ని తాగకపోవడమే మంచిది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్నారులు కూడా ఈ రసాన్ని తాగకూడదు.