Rinku Singh : ఐపీఎల్లో, టీమిండియాలో ఈమధ్య ఎక్కువగా మార్మోగిన పేరు రింకూ సింగ్ (Rinku Singh). పదహారో సీజన్(IPL 2023)లో సంచలన ఇన్నింగ్స్‌తో ఈ చిచ్చరపిడుగు భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఫినిషర్‌గా తన మార్క్ ఇన్నింగ్స్‌లతో అలరించిన రింకూ.. శ్రీలంక పర్యటనలో బంతితోనూ మ్యాజిక్ చేశాడు. దాంతో, 18వ సీజన్లో కోల్‌కతా అతడిపై భారీ ఆశలే పెట్టుకుంది. అయితే.. ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆ ఫ్రాంచైజీకి హ్యాండ్ ఇచ్చేలా ఉన్నాడు.
ఒకవేళ తనను కోల్‌కతా వదిలేస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru)కు ఆడుతానని రింకూ చెప్పాడు. పదహారో సీజన్లో శివాలెత్తిపోయిన రింకూ సింగ్‌కు 17వ సీజన్లో చాన్స్‌లే రాలేదు. నాలుగైదు ఇన్నింగ్స్‌లు ఆడినా మనపటిలా చెలరేగకపోయాడు. దాంతో, ఈసారి కోల్‌కతా అతడిని వదిలేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో, రింకూ కూడా కొత్త జట్టుకు మారేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది.
‘ కోల్‌కతా నన్ను అట్టిపెట్టుకుంటుందా? మే నెలలో మెగా వేలం జరుగుతుందా? అనేది ఇప్పటికైతే ఏమీ తెలియదు. ఏమి జరుగుతోందో చూద్దాం’ అని రింకూ అన్నాడు. కోల్‌కతా మిమ్మల్ని వద్దనుకుంటే ఏ జట్టుకు ఆడుతారు? అనే ప్రశ్నకు ‘ఆర్సీబీ’ అని రింకూ రిప్లయ్ ఇచ్చాడు.
కోల్‌కతా స్టార్ రింకూ సింగ్ ఆటను ఎవరూ మర్చిపోలేరు. 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)పై ఆఖరి ఓవర్లో ఐదు సిక్స్‌లతో అతను ఒక్కసారిగా హీరో అయిన విషయం తెలిసిందే. దాంతో, ఆసియా గేమ్స్(Asia Games 2023)లో ఆడే భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.
‘ఆ ఐదు సిక్స్‌లతో నా జీవితం మారిపోయింది. అంతకుముందు నేను ఏ కొద్ది మందికో తెలుసు. కానీ, ఆ ఇన్నింగ్స్ తర్వాత చాలామందికి నాగురించి తెలిసింది. అందుకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. అంతేకాదు ఆసియా గేమ్స్‌కు సెలెక్ట్ అయ్యానని తెలియగానే కుటుంబమంతా ఆనందంతో డాన్స్ చేసింది. ఇండియా తరఫున ఆడు. మేము నిన్ను బ్లూ జెర్సీలో చూస్తాం అని చెప్పడంతో ఎంతో పొంగిపోయాను’ అని రింకూ సింగ్ తెలిపాడు.