శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పారామిలిటరీ సిబ్బందిపై ఉగ్ర దాడి జరిగింది. ఈ సంఘటనలో సీఆర్పీఎఫ్ అధికారికి బుల్లెట్ గాయమైంది. ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. (CRPF inspector killed in terrorist attack) ఉధంపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగినట్లు చెప్పారు. జమ్ముకశ్మీర్ పోలీసు బలగాలు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) సంయుక్త పార్టీపై ఉగ్రవాదులు దాడి చేశారు. సోమవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో బసంత్‌గఢ్‌లోని మారుమూల ప్రాంతంలోని డూడు ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
కాగా, సీఆర్పీఎఫ్ 187వ బెటాలియన్‌కు చెందిన ఇన్స్పెక్టర్ కుల్దీప్ సింగ్‌కు బుల్లెట్ తగిలి గాయమైందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు చెప్పారు. ఆ ప్రాంతానికి వెంటనే అదనపు బలగాలను రప్పించినట్లు వివరించారు. పారిపోయిన ఉగ్రవాదులను గుర్తించి మట్టుబెట్టేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు వెల్లడించారు.