హైదరాబాద్, ఆగస్టు 28( నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు విద్యుత్తు వ్యవస్థ దెబ్బతిన్నది. సరఫరా నిలిచిపోయి పలు గ్రామాలు అంధకారంలో మగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న వ్యవస్థను పునరుద్ధరిస్తున్నామని ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సీఎండీలు ముషారఫ్ ఫారూఖీ, వరుణ్రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం రెండు సంస్థల పరిధిలోని చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెంటెండ్ ఇంజినీర్లు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అనంతరం మరమ్మతు పనులపై ఓ ప్రకటన విడుదల చేశారు.
దక్షిణ డిస్కం పరిధిలో 1357 స్తంభాలు నేలకూలాయని, 280 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని వెల్లడించారు. మెదక్ జిల్లాలో 15 గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోగా 10 గ్రామాల్లో పునరుద్ధరించామని, మిగిలిన గ్రామాల్లోనూ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉత్తర డిస్కం పరిధిలోని కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ సర్కిళ్ల పరిధిలో నేలకూలిన 108 స్తంభాల్లో 87 పునరుద్ధరించామని తెలిపారు. 21 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినగా 17 సరిచేశామని, నీట మునిగిన 86 ట్రాన్స్ఫార్మర్లలో ఆరింటిని తిరిగి అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ప్రమాదకర పరిస్థితుల్లోనూ సిబ్బంది శ్రమిస్తున్నారని, అధికారులు పర్యవేక్షిస్తున్నారని వివరించారు.