IND vs NZ 1st Test : చిన్నస్వామి స్టేడియంలో ఐదో రోజు భారత బౌలర్లు అద్భుతం చేయలేకపోయారు. తొలి రోజు.. నాలుగో రోజు ఆటకు అడ్డు పడిన వరుణుడు సైతం టీమిండియా వైపు నిలవలేదు. దాంతో, భారత గడ్డపై న్యూజిలాండ్ (Newzealand) జట్టు చరిత్ర సృష్టించింది. 18వ టెస్టు సిరీస్ ఉత్సాహంలో ఉన్న రోహిత్ సేనను బాధలో ముంచేస్తే 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో భారత్‌ను 462 పరుగులకే కట్టడి చేసిన కివీస్.. 107 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది.
ఈమధ్యే బంగ్లాదేశ్‌పై 2-0తో టెస్టు సిరీస్‌ను అలవోకగా గెలుపొందిన భారత్‌కు న్యూజిలాండ్ పెద్ద షాకిచ్చింది. శ్రీలంకపై దారుణంగా ఓడిన కివీస్ సంచలన ప్రదర్శనతో టీమిండియాపై రికార్డు సృష్టించింది. స్వల్ప ఛేదనలో ఓపెనర్లు డెవాన్ కాన్వే(17), టామ్ లాథమ్(0)లు ఓపెనర్లు విఫలమైనా యువకెరటాలు విల్ యంగ్(48 నాటౌట్), రచిన్ రవీంద్ర(39 నాటౌట్)లు ఏకాగ్రతగా ఆడారు. అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. దాంతో, 1988 తర్వాత భారత్‌లో మొదటి గెలుపుతో న్యూజిలాండ్ రికార్డు నెలకొల్పింది. భారీ విజయంతో కివీస్ మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
రెండో రోజు న్యూజిలాండ్ బౌలర్లు మ్యాట్ హెన్రీ(5/14), విలియం ఓరూర్కీ(4/22)ల పేస్ ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో, తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 46 పరుగులకే ఆలౌట్ అయి చెత్త రికార్డు మూటగట్టుకుంది. కివీస్ బౌలర్లను ఎదుర్కోలేక తంటాలు పడిన అదే పిచ్ మీద మూడో రోజు, నాలుగో రోజు టాపార్డర్, మిడిలార్డర్ దంచికొట్టారు.
🎥 WATCH
Maiden Test Ton: Super Sarfaraz Khan’s scintillating 150(195) 👌👌#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) October 19, 2024
సర్ఫరాజ్ ఖాన్(150) మెరుపు శతకానికి తోడూ రిషభ్ పంత్(99) విధ్వంసక బ్యాటింగ్‌తో కివీస్ బౌలర్లు కుదేలయ్యారు. అంతకుముందు విరాట్ కోహ్లీ(70), కెప్టెన్ రోహిత్ శర్మ(52)లు కూడా తమ వంతు బాధ్యతగా కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయితే.. హెన్రీ, రూర్కీలు పంజా విసరడంతో భారత్ 462కు ఆలౌటయ్యింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్‌కు వాతావరణం సహకరించింది. దాంతో, వెలుతురు లేమి కారణంగా 4 బంతులు పడగానే అంపైర్లు ఆటను నిలిపివేశారు.