Ramdas Athawale : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి రాజకీయాల్లో వేడి రాజుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ, ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటములలోని పార్టీల మధ్య సీట్ల పంపకంపై కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మహాయుతిలో భాగమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఎక్కవ సీట్లు కోరడం లేదని, కేవలం ఐదు సీట్లు మాత్రమే అడుగుతున్నామని అన్నారు. అయితే ఈ ఎన్నికల్లో కూటమి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మాత్రం రాష్ట్రంలో తమకు ఒక మంత్రి పదవి కావాలని కోరుతున్నామని ఆయన చెప్పారు. ఈ విషయమై తాము ఇవాళ ఉదయం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో, ఇతర బీజేపీ నేతలతో చర్చించామని చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమేగాక వచ్చే మహానగర పాలక ఎన్నికల్లో, జిల్లా పంచాయతీ ఎన్నికల్లో కూడా తమకు కావాల్సినన్ని సీట్లు దక్కుతాయని అథవాలే ఆశాభావం వ్యక్తంచేశారు.
కాగా, మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో అధికార కూటమి పార్టీలకు ప్రతికూలంగా ఫలితాలు రావడంతో ప్రతిపక్ష కూటమి గెలుపుపై ధీమాగా ఉన్నది.