Ravi Shastri : భారత టెస్టు జట్టు సారథిగా తొలి పరీక్షకు సిద్ధమవుతున్నాడు శుభమన్ గిల్ (Subhman Gill). ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)కు కెప్టెన్సీ వహించిన అనుభవం.. కోచ్ గౌతం గంభీర్ సహకారంతో మొదటి సిరీస్‌లోనే తన ముద్ర వేయాలనే కసితో ఉన్నాడీ యంగ్ లీడర్. జూన్ 20న లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియంలో ఇంగ్లండ్‌తో తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ పరిస్థితులను ఆకలింపు చేసుకోవడం.. జట్టును సమర్ధంగా నడిపించడం గిల్‌కు పెద్ద సవాల్. అయితే.. అతడు ఓపిక ఉంటేనే అనుకున్న ఫలితాలు సాధించగలడు అని శాస్త్రి తెలిపాడు.
‘ఇంగ్లండ్ పర్యటనలో కెప్టెన్‌గా రాణించడం గిల్‌కు నిజంగానే పెద్ద పరీక్ష. సీనియర్ల గైర్హాజరీలో ఉన్న వనరులతో జట్టును విజయ పథాన నడపడం గిల్ ముందున్న కఠిన సవాల్. అయితే.. సారథిగా ఇంగ్లండ్ పర్యటన, అక్కడి వాతావరణం గిల్‌కు కొత్త అనుభవం కానుంది. కాబట్టి అతడు ఓపికగా ఉంటే ఫలితాలు రాబట్టగలడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం వహించిన గిల్.. మైదానంలో తన వ్యూహాలతో మెప్పించాడు.
What are the three things you can think of..
..𝙒𝙝𝙚𝙣 𝙞𝙣 𝙀𝙣𝙜𝙡𝙖𝙣𝙙 🤔
Hear it from #TeamIndia 😎#ENGvIND pic.twitter.com/uJ52OJvi9B
— BCCI (@BCCI) June 18, 2025
ప్రశాంతంగా ఉంటూ భావి సారథిగా ఉండాల్సిన లక్షణాలు తనలో ఉన్నాయని చాటాడు. ఆటగాడిగానే కాదు వ్యక్తిగతంగానూ గిల్ ఎంతో మెరుగయ్యాడు. తన ఈడు వాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తూ వాళ్ల ప్రేమాభిమానాలు చూరగొన్నాడు. అయితే.. ఇప్పటికీ అతడు నేర్చుకునే దశలో ఉన్నాడు’ అని రవి శాస్త్రి వెల్లడించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీడ్కోలుతో భారత టెస్టు క్రికెట్లో నవశకం మొదలవ్వనుంది. గత ఏడాది నుంచి నిలకడగా రాణిస్తున్న గిల్ 37 వ సారథిగా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ పర్యటనతో అతడికి కెప్టెన్‌గా తొలి సిరీస్. సచిన్ – అండర్సన్ ట్రోఫీ జూన్ 20న షురూ కానుంది. బ్యాటింగ్ లైనప్ కసరత్తులో మునిగిపోయిన కోచ్ గంభీర్, గిల్.. గురువారం(జూన్ 19న) తుది జట్టును వెల్లడించే అవకాశముంది.
గిల్‌కు ఇంకా 25 ఏళ్లే. అతడి టెస్టు కెరియర్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. 2020 డిసెంబర్లో అరంగేట్రం చేసిన గిల్ 32 మ్యాచుల్లో 35.05 సగటుతో 1,893 పరుగులు సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై అతడి బ్యాటింగ్‌కే కాదు కెప్టెన్సీకి కూడా పెద్ద సవాల్ ఎదురుకానుంది. చివరిసారిగా భారత్ రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో 2007లో సిరీస్ విజేతగా నిలిచింది.