పోచమ్మ మైదాన్ : పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి(Konda Murali) సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏండ్ల ముసలోడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి నా కాళ్లు పట్టుకుంటే ఎమ్మెల్యేను చేశానని కొండా మురళి పేర్కొన్నారు. గురువారం వరంగల్‌లోని పోచమ్మమైదాన్ సెంటర్లో జరిగిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా కొండా మురళి రేవూరిపై విరుచుకుపడ్డారు. పరకాల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో తన కూతురు సుస్మితా పటేల్ పోటీ చేస్తుందని ప్రకటించారు. వరంగల్ తూర్పులో కొండా సురేఖ మరోసారి పోటీ చేస్తుందని, తనకు పార్టీ ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం వస్తుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ తనకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇస్తే ఎంత ఖర్చు పెట్టి అయినా సరే గెలుస్తానని కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కొంతమంది నాయకులు 15 సంవత్సరాలు టిడిపి వెంట ఉండి చంద్రబాబును ఓడించారని.. ఎవరైనా మీసాలు, గడ్డం తీయించుకుంటారు. కానీ, ఆయన కనుబొమ్మలు కూడా తీయించుకుంటారని పరోక్షంగా రేవూరిని విమర్శించారు. మళ్లీ కేసీఆర్ వెంట ఉండి ఆయనను తప్పు తోవ పట్టించి నాశనం చేశారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి ఏమి చేస్తారో తెలియదని చెప్పుకొచ్చారు.