కొత్తగూడెం అర్బన్, జూన్ 19 : భద్రాద్రి కోతగూడెం జిల్లాలో గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని సేవాలాల్ బంజారా సేన నాయకులు ఎస్టీ ట్రైబల్ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌ను గురువారం కలిసి విన్నవించారు. ఢిల్లీలోని ట్రైబల్ కమిషన్ కార్యాలయంలో సేవాలాల్ బంజారా సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్ గిరిజన సమస్యలపై వినతి పత్రం అందజేసి మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన సమస్యలు గురించి వివరించినట్లు చెప్పారు. జిల్లాలో ఏజెన్సీ ఏరియా 1/70 యాక్ట్, పీసా చట్టంను అధికారులు పకడ్బందీగా అమలు పరచడం లేదన్నారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరలు భూ కబ్జాలకు పాల్పడి అక్రమంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
అదుపు చేయాల్సిన జిల్లా అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో జరుగుతున్నటువంటి అక్రమాలపై జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టి సారించి గిరిజన ప్రజలకు న్యాయం చేకూర్చాలని కోరారు. విజ్ఞాపనలపై హుస్సేన్ నాయక్ సానుకూలంగా స్పందించినట్లు, వీలు చూసుకుని జిల్లాకు స్వయంగా వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో గిరిజన నాయకులు నునావత్ రాంబాబు నాయక్, టీడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షుడు వాంకుడోత్ హత్తి రామ్ నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూక్య రవి రాథోడ్ నాయక్, మాజీ సర్పంచ్ భుక్యా పాపనాయక్ ఉన్నారు.