IND vs ENG : బర్మింగ్హమ్లో విజయానికి ఏడు వికెట్ల దూరంలో ఉన్న భారత జట్టుకు షాకింగ్ న్యూస్. ఐదో రోజు తొలి సెషన్లో వికెట్ల వేటతో ఇంగ్లండ్‌ను ఆలౌట్ అంచున నిలపాలనుకున్న టీమిండియాకు వర్షం అడ్డంకిగా మారింది. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందే చినుకులు మొదలయ్యాయి. వర్షం దాంతో, ఐదో రోజు కాస్త ఆలస్యం కానుంది. భారత్ నిర్దేశించిన 608 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ 72కే మూడు కీలక వికెట్లు కోల్పోయిన విషయం తెలిసిందే.
టీమిండియా బ్యాటర్ల విధ్వంసానికి పరుగులు వరదలా పోటెత్తుతున్న ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. శనివారం టీ సెషన్ తర్వాత రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియాకు బౌలర్లు అదిరే ఆరంభం ఇచ్చారు. సిరాజ్, ఆకాశ్ దీప్(2-36)ల విజృంభణతో ఇంగ్లండ్ టాపార్డర్ కుప్పకూలింది. ఐదో రోజు ఆట మొదలవ్వడంతోనే వికెట్లు తీసి ఒత్తిడి పెంచాలని భారత బౌలర్లు ఆశించారు. కానీ, శనివారం నుంచి వాన వచ్చిపోతూ వుంది.
రాత్రి కాసేపు తెరిపినిచ్చిన వర్షం.. ఆదివారం ఉదయం కూడా పలకరించింది. అయితే.. మధ్యాహ్నం మ్యాచ్ సమయానికి మళ్లీ చిన్నగా చినుకులు మొదలయ్యాయి. దాంతో, ఇరుజట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం అయ్యారు. భారీ లక్ష్యాన్ని నిర్దేశించి.. ఆపై మూడు వికెట్లు చకచకా తీసేసిన భారత జట్టు మాత్రం కాస్తం ఆందోళనతో ఉంది. గెలవాల్సిన మ్యాచ్ ఎక్కడ డ్రాగా ముగుస్తుందోనని ఒకింత కంగారు పడుతున్నారు ఆటగాళ్లు. కానీ, వాన కారణంగా మ్యాచ్ చేజారకుండా ఉంటుందని ఇంగ్లండ్ ప్లేయర్స్ రిలాక్స్‌గా ఉన్నారు.