Paris Olympics | దేశంలో గత కొన్నేండ్లుగా క్రికెట్‌కు సమాంతరంగా క్రేజ్ సంపాదిస్తున్న బ్యాడ్మింటన్‌లో గడిచిన మూడు ఒలింపిక్స్‌లోనూ మనకు పతకం దక్కింది. 2012లో సైనా నెహ్వాల్ ఈ క్రీడలో తొలి పతకాన్ని అందిస్తే పీవీ సింధు.. 2016, 2020లో వరుసగా రజతం, కాంస్యం సాధించడంతో ‘పారిస్’లోనూ మన షట్లర్లపై భారీ అంచనాలే ఉన్నాయి. తెలుగమ్మాయి పీవీ సింధు ‘ఒలింపిక్ హ్యాట్రిక్ మెడల్’పై కన్నేయగా గత రెండేండ్లుగా అంచనాలకు మించి రాణిస్తున్న పురుషుల డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్‌తో పాటు మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో పతక ఆశలు రేపుతున్న నేపథ్యంలో ఏడుగురు షట్లర్ల బృందంతో కూడిన భారత ఆటగాళ్లు పతకం గెలిచే ఆనవాయితీని కొనసాగిస్తారా?
2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యోలో కాంస్యం గెలిచిన సింధు ఈసారి పతకం రంగు మార్చాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. వాస్తవానికి 2022లో బర్మింగ్‌హామ్ వేదికగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ తర్వాత ఒక్క మేజర్ టైటిల్ కూడా నెగ్గని సింధు ఫామ్ ఆందోళనకరంగానే ఉంది. గతేడాది ఆమె గాయంతో సతమతమైంది. ఇటీవల పలు బీడబ్ల్యూఎఫ్ టోర్నీలలో ఆడినా ఆశాజనక ప్రదర్శనలు చేయలేకపోయింది. ఒలింపిక్స్‌లో గ్రూప్-ఎమ్ లో సులువైన డ్రా దక్కడం ఆమెకు కలిసొచ్చేదే. తనకంటే తక్కువ ర్యాంకు ఉన్న క్రిటిన్ కూబా (ఈస్టోనియా), ఫాతిమా (మాల్దీవులు)తో ఆడబోయే సింధుకు లీగ్ దశను దాటడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ప్రిక్వార్టర్స్, క్వార్టర్స్‌లో ఆమెకు చైనా షట్లర్లు బింగ్ జియావో, చెన్ యు ఫీ నుంచి కఠిన సవాల్ ఎదురుకానుంది. అయితే వరల్డ్ చాంపియన్‌షిప్స్, ఒలింపిక్స్ వంటి భారీ ఈవెంట్లలో సింధుకు చైనా షట్లర్లపై మెరుగైన రికార్డు ఉంది. క్వార్టర్స్ గండాన్ని దాటితే ఆమె దేశానికి మరో పతకాన్ని ఖాయం చేసినట్టే!
బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు రెండు పతకాలు అందించినా ఈ టోర్నీలో భారత్ నుంచి ఫేవరేట్లుగా ఉన్నది మాత్రం సాత్విక్-చిరాగ్ జోడీనే. టోక్యో ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన ఈ ద్వయం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా ఆ తర్వాత మూడేండ్లలో కోచ్ మాథియస్ బోయె శిక్షణలో రాటుదేలింది. ప్రతిష్టాత్మకమైన థామస్ కప్ విజయంలో వీరి కృషి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ఆ తర్వాత కామన్వెల్త్, ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్‌లలో స్వర్ణాలు, వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన ఈ జోడీ ఈ ఏడాది వరల్డ్ నంబర్‌వన్ ర్యాంకునూ సొంతం చేసుకుంది. విశ్వక్రీడల్లో మూడో సీడ్‌గా బరిలోకి దిగుతున్న ఈ ద్వయం.. గ్రూప్-సీలో లుకాస్ కొర్వి, రొనన్ లబర్ (ఫ్రాన్స్), అల్ఫియన్, అర్డియాంటో(ఇండోనేషియా), లమ్సస్, సీడెల్ (జర్మనీ)తో తలపడనుంది. ప్రస్తుతమున్న ఫామ్ దృష్ట్యా ఈ జోడీ క్వార్టర్స్ చేరడం సులువే అయినప్పటికీ ఆ తర్వాత ఎదురయ్యే ప్రత్యర్థులతో ఎలా ఆడతారనే దానిపై వారి పతక అవకాశాలు ఆధారపడ్డాయి.
పురుషుల సింగిల్స్‌లో భారత్ ఈసారి ప్రణయ్, లక్ష్యసేన్‌తో బరిలోకి దిగుతోంది. 2004లో ఏథెన్స్ ఒలింపిక్స్ (నిఖిల్ కనిత్కర్, అభిన్శ్యామ్ గుప్తా) తర్వాత మెన్స్ సింగిల్స్‌లో ఇద్దరు షట్లర్లు పోటీపడనుండటం ఇదే ప్రథమం. విశ్వక్రీడల్లో 13వ సీడ్‌గా బరిలోకి దిగనున్న ప్రణయ్‌కు గ్రూప్-కేలో సులువైన ప్రత్యర్థులున్నారు. లీగ్ దశలో తనకంటే తక్కువ ర్యాంకు ఉన్న లి డక్ ఫట్ (వియత్నాం), ఫాబియన్ రోత్ (జర్మనీ)తో పోటీపడనుండటంతో అతడు కాస్త శ్రమిస్తే ప్రిక్వార్టర్స్‌కు చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక గ్రూప్-ఎల్లో ఉన్న లక్ష్యసేన్‌కు మాత్రం ప్రపంచ 19వ ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ, గత ఒలింపిక్ సెమీఫైనలిస్టు కెవిన్ కార్డన్, జులియన్ కరెగితో తలపడాల్సి ఉంది. అన్ని సజావుగా సాగి ప్రణయ్, సేన్ లీగ్ దశ దాటినా దురదృష్టవశాత్తూ ఈ ఇద్దరే ప్రి క్వార్టర్స్‌లో ఢీకొననున్నారు.
గ్రూప్-సిలో ఉన్న అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టోకు తమకంటే మెరుగైన ర్యాంకు కలిగిన చిహారు, మత్సుయమ (జపాన్), కిమ్ సొ యోంగ్, కాంగ్ హీ యోంగ్ (కొరియా), మపస,అంగెలె యు (ఆస్ట్రేలియా) వంటి కఠిన ప్రత్యర్థులున్నారు. అయితే గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న ఈ జోడీ పారిస్‌లో సత్తా చాటాలని భావిస్తోంది.
సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో

01