IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌ను భారీ విజయంతో మొదలు పెట్టి పంజాబ్ కింగ్స్(Punjab Kings) ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడింది. ఐదో స్థానంలో ఉన్న శ్రేయాస్ అయ్యర్ సేన శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో తలపడనుంది. కీలకమైన ఈ మ్యాచ్ కోసం పంజాబ్ తనుష్ కొతియాన్(Tanush Kotian)ను నెట్ బౌలర్‌గా తీసుకుంది. రంజీ ట్రోఫీలో ముంబైకి ఆడే ఈ స్పిన్నర్ అండగా.. మాజీ ఛాంపియన్‌ను దెబ్బకొట్టాలనే వ్యూహంతో ఉంది అయ్యర్ బృందం.
కోల్‌కతాకు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ రూపంలో మిస్టరీ స్పిన్నర్లు ఉన్నారు. వీళ్లను ఎదుర్కోవడం కష్టమే కాదు కొన్నిసార్లు అసాధ్యం కూడా. అందుకే.. స్పిన్‌లో వైవిధ్యం చూపగల 26 ఏళ్ల తనుష్ సేవల్ని అందిపుచ్చుకోవాలనుకుంది పంజాబ్. ఆఫ్ స్పిన్నర్ అయిన తనుష్.. కోల్‌కతా స్పిన్ ద్వయాన్ని సమర్థంగా ఎదుర్కోవడంలో పంజాబ్‌కు ఉపయోగపడున్నాడు. స్పిన్ బౌలింగ్ కోచ్ సునీల్ జోషితో సుదీర్ఘ సమయం మాట్లాడిన తనుష్.. ఆ కాసేపటికే నెట్స్‌లో పంజాబ్ బ్యాటర్లకు బౌలింగ్ చేస్తూ కనిపించాడు.
Mumbai’s Tanush Kotian joined PBKS as Net Bowler.
📷 @RevSportzGlobal pic.twitter.com/ZLUzpXkNKP
— CricketGully (@thecricketgully) April 25, 2025
దేశవాళీలో నిలకడగా రాణిస్తున్న తనుష్.. ఆల్‌రౌండర్ కూడా. అచ్చం భారత మాజీ స్పిన్నర్ అశ్విన్ మాదిరిగా ఉంటుంది తనుష్ బౌలింగ్ యాక్షన్. అందుకే.. అతడిని ఎదర్కోవడం కష్టంగా ఉంటుంది. దాంతో, 17వ సీజన్లో ఈ యువకెరటాన్ని రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) దక్కించుకుంది. కానీ, ఒకే ఒక మ్యాచ్‌కు పరిమితం చేసింది. ఇక 18వ ఎడిషన్ ముందు జరిగిన మెగా వేలంలో రూ.30 లక్షలకు తనుష్ పాల్గొన్నాడు. కానీ, అతడిని ఏ ఫ్రాంచైజీ కొనలేదు. దాంతో, దేశవాళీపై గురి పెట్టిన తనుష్.. ముంబై జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.