శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో కాల్పులు జరిపి 26 మందిని చంపిన ఉగ్రవాదుల్లో నలుగురిని తాను చూసినట్లు ఒక మహిళ సమాచారం ఇచ్చింది. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. కథువాలో భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. (Search operation in JK) జమ్ముకశ్మీర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఘటనా స్థలానికి చేరుకున్నది. ఆ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నది. పోలీస్ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు.
మరోవైపు జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా, బారాముల్లాలో కూడా సోదాలు, కూంబింగ్‌లు కొనసాగుతున్నాయి. బారాముల్లాలోని పట్టాన్ ప్రాంతంలో నిషేధిత జమ్ముకశ్మీర్ నేషనల్ ఫ్రంట్ (జేకేఎన్ఎఫ్) చేపడుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలపై దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా గులాం మహ్మద్ గనై నివాసంలో శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సమక్షంలో తనిఖీలు చేపట్టారు. నేరారోపణలకు సంబంధించిన వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ సంస్థ కార్యకలాపాలపై మరింతగా దర్యాప్తు చేస్తున్నారు.