Sanjay Bangar : వచ్చే ఏడాది జరుగబోయే ఇండియన్ ప్రీమియర్ మెగా వేలం(IPL Mega Aucton) ఆసక్తికరంగా మారనుంది. ఇప్పటికే హెడ్‌కోచ్‌లను మార్చిన ఫ్రాంచైజీలు ఐపీఎల్ టైటిల్ కల తీర్చే కెప్టెన్ కోసం ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెట్టేందుకు సిద్దమవుతున్నాయి. ఈసారి మెగా వేలంలో రికార్డు ధర పలికేవాళ్ల జాబితాలో ముంబై ఇండియన్స్(Mumbai Indians) మాజీ సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) పేరు వినిపిస్తోంది. తాజాగా పంజాబ్ కింగ్స్(Punjab Kings) క్రికెట్ డెవలప్మెంట్ హెడ్ సంజయ్ బంగర్ (Sanjay Bangar) సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
‘రోహిత్ శర్మ వేలానికి వస్తాడా? లేదా? అనే విషయంలో స్పష్టత కోసం మేము ఎదురుచూస్తున్నాం. రోహిత్‌ను ముంబై అట్టిపెట్టుకుంటుందా? లేదా? అనేది తెలియాలి. నేను ఒకప్పుడు రోహిత్‌తో దక్కన్ చార్జర్స్(Deccan Chargers)కు ఆడాను. ఇప్పుడు అతడు ముంబై ఆటగాడు. అతడు గనుక ఆక్షన్‌లో ఉంటే ఫ్రాంచైజీలు పోటీ పడుతాయి. హిట్‌మ్యాన్ అందరికంటే అత్యధిక ధర పలికే ఆవకాశం ఉంది. అప్పుడు మా పర్స్‌లో ఎంత డబ్బు ఉంటుందో చూసుకొని ఆలోచిస్తాం’ అని బంగర్ తెలిపాడు.
ముంబైని ఐదు సార్లు విజేతగా నిలిపిన రోహిత్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)లు కూడా కాచుకొని ఉన్నాయి. హిట్‌మ్యాన్‌ను దక్కించుకునేందుకు రూ.50 కోట్లు అయినా వెచ్చించేందుకు ఈ రెండు ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నాయని సమాచారం.
రెవ్ స్పోర్ట్స్‌కు చెందిన రోహిత్ జుగ్లన్ విశ్లేషణ ప్రకారం.. మెగా వేలానికి ముందే రోహిత్ శర్మను కొనేందుకు పలు జట్లు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే.. ఢిల్లీ క్యాపిటల్స్ అతడి కోసం ఏకంగా రూ.50 కోట్లు దాచి పెట్టుకుంది. రిషభ్ పంత్ (Rishabh Pant)ను వదిలేసే ఆలోచనలో ఉన్న ఢిల్లీ రోహిత్‌ను ఎలాగైనా తమ కెప్టెన్‌గా నియమించుకోవాలని భావిస్తోంది.
మరోవైపు కేఎల్ రాహుల్(KL Rahul)పై నమ్మకం కోల్పోయిన లక్నో సూపర్ జెయింట్స్ సైతం రోహిత్ శర్మపై గురి పెట్టింది. రోహిత్ ఓకే చెప్పడమే ఆలస్యం రూ.50 కోట్లు చెల్లించేందుకు రెడీగా ఉన్నాయి ఈ రెండు ఫ్రాంచైజీలు. 17వ సీజన్లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడిని హిట్‌మ్యాన్ ఫ్రాంచైజీ మారనున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. టీమిండియా 13 ఏండ్ల పొట్టి ప్రపంచ కప్ కలను నిజం చేసిన అతడిని ఢిల్లీ, లక్నోలలో ఏ జట్టు సొంతం చేసుకుంటుందో చూడాలి.