IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 17వ సీజన్ వేలానికి మరో రెండు వారాల్లో తెరలేవనుంది. దాంతో, శుక్రవారం బీసీసీఐ(BCCI) వేలంలో పాల్గొంటున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఈసారి 1,166 మంది వేలంలో తమ పేర్లు రిజిష్టర్ చేసుకున్నారు. దాంతో, అన్ని ఫ్రాంచైజీలు గెలుపు గుర్రాల వేటలో ఉన్నాయి. పంజాబ్ కింగ్స్(Punjab Kings) మాత్రం ఈ ఎడిషన్‌లో టాప్ ఆల్రౌండర్లపై దృష్టి పెట్టింది.
శార్దూల్ ఠాకూర్(భారత్) తో పాటు వనిందు హసరంగ(శ్రీలంక)ను వేలంలో దక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. నిరుడు రూ.10.75 కోట్లు పలికిన శార్దూల్ ఈసారి రూ.2 కోట్ల కనీస ధరతో వేలానికి వస్తున్నాడు. ఇక హసరంగ ఈసారి రూ. 1.5 కోట్ల కనీస ధరతో ఉన్నాడు. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) న్యూజిలాండ్ పేసర్ లూకీ ఫెర్గూసన్‌పై గురి పెట్టింది.
హర్షల్ పటేల్

ఇప్పటికే ఆ ఫ్రాంచైజీ మార్క్ వుడ్, నవీన్ ఉల్ హక్‌లను రీటైన్ చేసుకుంది. ఫెర్గూసన్ కూడా జట్టులో చేరితే ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ మరింత బలోపేతం కానుంది. ఆర్సీబీ విడుదల చేసిన హర్షల్ పటేల్(Harshal Patel)కు కూడా వేలంలో భారీ డిమాండ్ ఉండనుంది. రూ. 2 కోట్ల కనీస ధరతో ఉన్న ఈ స్టార్ బౌలర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంది.

ఈసారి మినీ వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరతో 25 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీళ్లలో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ హీరోలు ఏడుగురు, ముగ్గురు టీమిండియా ఆటగాళ్లూ ఉన్నారు. దక్షిణాఫ్రికా నుంచి ముగ్గురు, ఇంగ్లండ్ నుంచి ఏకంగా ఏడుగురు ఆటగాళ్లు వేలంలో భారీ ధరకు తమ పేర్లు రిజిష్టర్ చేసుకున్నారు. డిసెంబర్ 19న దుబాయ్‌లో 17వ సీజన్ మినీ వేలం(IPL Mini Auciton) జరుగనుంది. ఈసారి 1,166 మంది పేర్లు రిజిష్టర్ చేసుకున్నారు. వీళ్లలో 830 మంది భారత క్రికెటర్లు ఉన్నారు. ఈ మొత్తం జాబితాలో 212 మంది క్యాప్డ్ ఆటగాళ్లు కాగా.. 909 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు. అన్ని ఫ్రాంచైజీలు మొత్తంగా ఈసారి 262.95 కోట్లు ఖర్చు చేయనున్నాయి.