IPL 2025 : వాయిదా పడిన ఐపీఎల్ 18వ సీజన్ పునః ప్రారంభం కానుంది. మే 16 నుంచి మ్యాచ్‌లు జరిగే అవకాశముందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్‌పై గురి పెట్టిన జట్లు ప్రాక్టీస్ వేగం పెంచుతున్నాయి. అయితే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు విదేశీ క్రికెటర్ల సేవల్ని కోల్పోనున్నాయి. కానీ, పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మాత్రం ఈ విషయంలో లక్కీ అని చెప్పాలి.
హెడ్ కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting) తాను భారత్‌లోనే ఉండిపోవడమే కాకుండా విదేశీ క్రికెటర్లను ఒప్పించాడు. అతడివల్లనే మా జట్టులోని కీలక ఆటగాళ్లు స్వదేశాలకు వెళ్లలేదు అని పంజాబ్ కింగ్స్ సీఈఓ సతీశ్ మీనన్ (Satish Menon) వెల్లడించాడు.
భారత్, పాకిస్థాన్‌లు మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో పలువురు విదేశీ క్రికెటర్లు కంగారు పడ్డారు. స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొందరైతే విమానం ఎక్కేశారు కూడా. పంజాబ్ హెడ్‌కోచ్ అయిన రికీ పాంటింగ్ కూడా ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్నాడట. ‘మే 10 సాయంత్రం తన లగేజీ సర్దుకొని ఫ్లయిట్ ఎక్కేందుకు పాంటింగ్ రెడీ అయ్యాడు.
అప్పుడే కాల్పుల విరమణ విషయం తెలిసింది. వెంటనే పాంటింగ్ విమానం దిగి.. వెనక్కి వచ్చేశాడు. అతడు రావడమే కాకుండా స్క్వాడ్‌లోని మార్కో యాన్సెన్, అజ్మతుల్లా ఉమర్జాయ్ సహ ఇతర విదేశీ ఆటగాళ్లను ఉండిపోవాల్సిందిగా కోరాడు. మా జట్టు ఐపీఎల్ టైటిల్ కలను సాకారం చేయాలనుకున్న పాంటింగ్.. ఆటగాళ్లలో భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసం నింపాడు’ అని సతీశ్ తెలిపాడు.
ఐపీఎల్ 18వ సీజన్లో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా ఆడుతోంది. శ్రేయాస్ అయ్యర్, పాంటింగ్‌ల మార్ద నిర్దేశనంలో ప్లే ఆఫ్స్ బరిలో నిలిచింది పంజాబ్. అయితే.. మే 8న ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు అయింది. దాంతో, ఇరుజట్లకు చెరొక పాయింట్ కేటాయిస్తారనుకుంటే అదీ జరగలేదు. సో.. ప్రస్తుతం పంజాబ్ 15 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతోంది.
Uncapped, Unstoppable! 🔥 pic.twitter.com/0N7h3gqdTw
— Punjab Kings (@PunjabKingsIPL) May 10, 2025