ఇబ్రహీంపట్నం : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారుల ( Fishermen ) సమస్యలను పట్టించుకోవడంలో కాంగ్రెస్( Congress) ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం ( CPM ) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ( John Wesley) అన్నారు.ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని శేరిగూడ చేపల పెంపక కేంద్రాన్ని సీపీఎం నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలోని వృత్తిదారుల సమస్యలు పట్టించుకోకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని శేరిగూడలోగల చేపల పెంపకం కేంద్రం సుమారు 60 ఏండ్ల క్రితం నిర్మించినప్పటికీ దానిని పట్టించుకోవటంలో విఫలమైన కాంగ్రెస్ నేడు పూర్తిగా కూల్చివేయటం దారుణమని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 32 చేపల పెంపక కేంద్రాలను పూర్తిగా నిరూపయోగంగా ఉంచటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని చేపల పెంపక కేంద్రాలను శిథిలావస్థలో ఉంచి ఆంధ్రా ( Andhra Pradesh) నుంచి ఎగుమతి చేసుకోవటం కాంగ్రెస్ నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తుందని విమర్శించారు. మత్స్యకారులు తమ సొసైటీల ద్వారా చేపపిల్లలు పెంచుకునే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. చేపల పెంపకానికి సంబంధించిన డబ్బులను నేరుగా సొసైటీల ఖాతాల్లో జమచేయాలని కోరారు.
ఈనెల 15న మత్స్యకారుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త ధర్నాకు సీపీఎం పూర్తి మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, కార్యదర్శివర్గ సభ్యులు సామెల్, జగన్, మత్స్యకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, నాయకులు గోరెంకల నర్సింహ, చెనమోని శంకర్, సీపీఎం మండల కార్యదర్శి బుగ్గరాములు, మత్స్యకారుల సంఘంనాయకులు యాదయ్య, నర్సింహం, వెంకటేష్, బిక్షపతి, రాఘవేందర్తదితరులు పాల్గొన్నారు.