Mothers day | కోల్ సిటీ, మే 11: మాతృ దినోత్సవం సందర్భంగా కని పెంచిన అమ్మను గుర్తు చేసుకోవడం లేదంటే సత్కరించడం సాధారణం. కానీ రామగుండం నగర పాలక సంస్థ ఓ మాజీ ప్రజా ప్రతినిధి తనలోని మాతృ ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు. అందరిని కోల్పోయి అనాథలుగా మారి ఆశ్రమంలో సేద తీరుతున్న ఆనాధ వృద్ధుల వద్దకు వెళ్లి వారిని శాలువాతో సన్మానించి తోచినంతగా ఆర్థిక సాయం అందజేసి రామగుండం కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ శభాష్ అనిపించుకున్నాడు.
ఆదివారం మాతృ దినోత్సవం పురస్కరించుకొని తన తల్లి సౌందర్యమ్మను స్మరిస్తూ గోదావరిఖని బస్టాండ్ వద్ద గల మున్సిపల్ నైట్ షెల్టర్లో తలదాచుకుంటున్న వృద్ధ మహిళలను కలిసి వారి మధ్య కేక్ కట్ చేసి స్వీట్ తినిపించి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వారిని శాలువాలతో సన్మానించి ఒక్కొక్కరికి ఆర్ధిక సాయామందించి వారి కళ్లలో ఆనందం నింపాడు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ తన తల్లి సౌందర్యమును తలుచుకుంటూ మాతృ దినోత్సవంను అమ్మలాంటి ఈ అనాథ మహిళల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
వీరందరిలో తన తల్లిని చూసుకున్నానని, నా అనే వారిని కోల్పోయే విధి వంచితులైన ఈ అమ్మలను ఆదుకోవడం ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీ, మిత్రులు పూదరి శ్రీనివాస్, ఎస్కె ఇంతియాజ్, సిరికొండ కోఠి, నైట్ షెల్టర్ ఇన్చార్జి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.