Bajrang Punia : ఒలింపిక్ విజేత బజరంగ్ పూనియా (Bajrang Punia) వెనక్కి తగ్గాడు. రెండేళ్ల క్రితం తాను చేసిన వ్యాఖ్యలకు రెజ్లింగ్ కోచ్ నరేశ్ దహియాకు అతడు బేషరతుగా క్షమాపణలు చెప్పాడు. పరువునష్టం కేసు (Defamation Case)లో తన తప్పును అంగీకరించిన పూనియా.. ఒక ప్రకటన విడుదల చేస్తూ సారీ చెప్పాడు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు నరేశ్ దహియాకు బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నా. జంతర్ మంతర్ వద్ద జరిగిన సభలో దహియాపై సత్యదూరమైన వ్యాఖ్యలు చేశాను. ఆయన పరువు, ప్రతిష్టలు దెబ్బతినేలా ఆరోజు నేను మాట్లాడినందుకు ఇప్పుడు ఎంతగానో బాధ పడుతున్నా అని గురువారం ఈ స్టార్ రెజ్లర్ తెలిపాడు.
‘దహియా మంచి పేరున్న కోచ్. దేశం కోసం ఆయన ఎంతో సేవ చేశారు. నా వ్యాఖ్యలతో ఆయన మనసు నొప్పించాను. అందుకే.. దహికు, ఆయన సన్నిహితులను నేను క్షమాపణలు కోరుతున్నా’ అని పూనియా తన ప్రకటనలో వెల్లడించాడు. బజరంగ్ సారీ చెప్పడంతో దహియా స్పందిస్తూ.. తాను అంగీకరిస్తున్నాని అన్నాడు.
‘పూనియా తరఫు న్యాయవాదితో మా న్యాయవాది మాట్లాడాడు. పూనియా క్షమాపణలు చెప్పడాన్ని నేను అంగీకర్తిస్తున్నా. నాకు బ్రిజ్ భూషణ్‌తో ఎలాంటి సంబంధాలు లేవు. పని నిమిత్తం మాత్రమే నేను 3 – 4 సార్లు రెజ్లింగ్ సమాఖ్య కార్యాలయానికి వెళ్లాను’ అని దహియా వివరణ ఇచ్చాడు. రెజ్లింగ్ కోచింగ్‌లో అనుభవజ్ఞుడైన దహియా ఢిల్లీలోని షాదాబ్ డెయిరీ ప్రాంతంలో చోటు రామ్ వ్యాయామశాల పేరుతో శిక్షణ ఇస్తున్నారు.
రెండేళ్ల క్రితం మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన అప్పటి రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ (Brij Bhushan)కు వ్యతిరేకంగా రెజ్లర్లు ఆందోళన చేపట్టారు. ఆ ఉద్యమాన్ని బజరంగ్, సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్‌లు ముందుండి నడిపించారు. ఆ సమయంలోనే మే 10న జంతర్ మంతర్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. కోచ్ నరేశ్ దహియాపై పూనియా మండిపడ్డాడు.
ఆయన కూడా మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేశాడని పూనియా ఆరోపించాడు. అయితే.. తనపై నిరాధారమైన వ్యాఖ్యలు చేసిన పూనియాను దహియా కోర్టుకు ఈడ్చాడు. ఈ నేపథ్యంలో ఒలింపియన్ పూనియాక్ సమన్లు జారీ చేసిన న్యాయస్థానం ఈ నెల 17న అతడికి బెయిల్ మంజూరు చేసింది.