కోల్కతా: ప్రపంచకప్లో భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా..మెగాటోర్నీలో మిగతా మ్యాచ్లకు పూర్తిగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ వేస్తున్న క్రమంలో హార్దిక్ గాయపడ్డాడు.
అప్పటి నుంచి జట్టుకు దూరమైన హార్దిక్..జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో పునరావాసం పొందుతున్నాడు. అయితే కాలి మడమ దగ్గర వాపు ఉండటం, పూర్తిగా మానేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో హార్దిక్ స్థానంలో కర్నాటక యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను ఎంపిక చేశారు.