Malaysia Masters : మలేషియా మాస్టర్స్‌లో భారత స్టార్ షట్లర్లు అదరగొట్టారు. ఫేవరెట్లు హెచ్ఎస్ ప్రణయ్ (HS Prannoy), కిడాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth)లతో పాటు కరుణాకరన్, ఆయుశ్ శెట్టిలు ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌లో సత్తా చాటినఈ ముగ్గురు రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. అయితే.. మహిళల సింగిల్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పీవీ సింధు (PV Sindhu) పోరాటం ముగిసింది. ఒలింపిక్ విజేత అయిన సింధు మొదటి రౌండ్లోనే నిరాశపరుస్తూ ఇంటిదారి పట్టింది.
కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న మలేషియా మాస్టర్స్‌లో ప్రణయ్ అదరగొట్టాడు. జపాన్‌కు చెందిన ఐదో సీడ్ కెంటా నిషిమొటోను చిత్తు చేశాడు. గంట 22 నిమిషాల పాటు సాగిన పోరులో భారత స్టార్ 21-17, 21-16తో గెలుపొందాడు. రెండో రౌండ్లో ప్రణయ్‌కు జపాన్ షట్లర్ యుషి తనక ఎదురువ్వనున్నాడు. ఇక మూడో సీడ్ చౌ థియెన్ చెన్‌తో జరిగిన మ్యాచ్‌లో కరుణాకరన్ అద్భుతంగా ఆడాడు. చైనీస్ తైపీ ఆటగాడైన చౌపై 21-13, 21-14తో జయభేరి మోగించి టోర్నీలో శుభారంభం చేశాడు. తర్వాతి రౌండ్లో క్రిస్టో పొవోవ్(ఫ్రాన్స్)ను కరుణాకరన్ ఢీ కొట్టనున్నాడు.
2 GREAT WIN FOR THE INDIAN MEN’S SINGLES AT THE 🇲🇾 MASTERS
HS Prannoy defeated WR 12 Kenta Nishimoto 19-21, 21-17, 21-16
HSP made a great comeback from 7-12 down in the decider
Sathish upsets WR 7 Chou Tien Chen 21-14, 21-13 to reach the R16
Best win for him in his career pic.twitter.com/d5GktOk5V0
— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) May 21, 2025
మాజీ నంబర్ 1 కిడాంబి శ్రీకాంత్ సైతం తన రాకెట్ పవర్ చూపిస్తూ ప్రత్యర్థిని మట్టికరిపించాడు. తనకంటే ఎక్కువ ర్యాంకర్ అయిన లూ గాంజ్ జూ(చైనా)ను చిత్తుగా ఓడించాడు. 57 నిమిషాల పోరులో శ్రీకాంత్ తొలి సెట్ గెలిచి జూపై పైచేయి సాధించాడు. అయితే.. ఆ తర్వాత పుంజుకున్న చైనీస్ షట్లర్ రెండో సెట్ గెలవగా. మూడో సెట్ కీలకమైంది. ఈ సెట్లో చెలరేగిన శ్రీకాంత్ 21-11తో గెలుపొంది రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు.
కిడాంబి శ్రీకాంత్ విజయానందం
ఈ సీజన్లో పెద్దగా ఫామ్ లేని సింధు.. మలేషియా ఓపెన్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. కానీ, చెత్త ఆటతో తొలి రౌండ్లోనే ఓడి టోర్నీనుంచి నిష్క్రమించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో వియత్నాం షట్లర్ గుయెన్ థుయ్ లిన్హ్ ధాటికి భారత స్టార్ చేతులెత్తేసింది. రెండో సెట్ గెలుపొందినప్పటికీ.. 11-21, 21-14, 15-21తో పరాజయం పాలైంది. మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల, తనీష క్రాస్టో ద్వయం రెండో రౌండ్లో అడుగు పెట్టింది.