జూలూరుపాడు, మే 21 : ఖమ్మం జిల్లా వైరాలో ఈ నెల 24న నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం మండలంలోని పలు శాఖల అధికారులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగా జాబ్ మేళా పోస్టర్ ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. వైరా నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 24న ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది విస్తృత ప్రచారం చేసి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ఈ జాబ్ మేళాలో 80 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.
జాబ్ మేళాకు వచ్చే నిరుద్యోగ యువతీ యువకులకు మధ్యాహ్న భోజన వసతి కూడా కల్పించడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 12 వేల మంది నిరుద్యోగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా నియోజకవర్గంలో కనీసం 5 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. అనంతరం జాబ్ మేళా గోడ పత్రికలను స్థానిక అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కరుణాకర్ రెడ్డి, ఎంపీఓ తులసీరామ్, ఎస్ఐ రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకట్‌రెడ్డి, మండలాధ్యక్షుడు మంగీలాల్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Julurupadu : వైరాలో ఈ 24న మెగా జాబ్ మేళా : ఎమ్మెల్యే రాందాస్‌నాయక్