PCB : వచ్చే ఏడాది పాకిస్థాన్ గడ్డపై జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)పై నీలినీడలు కమ్ముకున్నాయి. దాయాది దేశానికి జట్టును పంపేందుకు భారత బోర్డు సిద్ధంగా లేకపోవడంతో వేదికను తరలిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐసీసీ (ICC) వార్షిక సమావేశం మరో ఐదు రోజుల్లో జరుగనుంది. దాంతో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ వైఖరిని మరోసారి బల్లగుద్ది చెప్పేందుకు సిద్ధమైంది.
అంతేకాదు తమ దేశంలో జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఆడకుంటే టీ20 వరల్డ్ కప్ నుంచి వైదొలగాలని పీసీబీ భావిస్తోంది. అవును 2026లో భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న మెగా టోర్నీని బాయ్‌కాట్ చేయాలని పాక్ బోర్డు అనుకుంటోంది.

జూలై 19 -22 మధ్య ఐసీసీ వార్షిక సమావేశం జరుగనుంది. ఈ సందర్బంగా చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడుతుందా? లేదా? అనే అంశంపై పీసీబీ పట్టుబట్టనుంది. మరోవైపు బీసీసీఐ కూడా హైబ్రిడ్ మోడల్లో టోర్నీ నిర్వహించాల్సిందిగా ఐసీసీని కోరే అవకాశముంది. షెడ్యూల్ ప్రకారం చాంపియన్స్ ట్రోఫీ 2025 హక్కులను పాక్ దక్కించుకుంది.

అయితే.. భద్రతా కారణాల రీత్యా దాయాది దేశానికి జట్టుకు పంపేందుకు బీసీసీఐ ఇష్టపడడం లేదు. అందుకనే దుబాయ్ వేదికగా టోర్నీ నిర్వహించాలని ఇప్పటికే సెక్రటరీ జై షా ప్రతిపాదన చేశాడు. కానీ, ఐసీసీ ఇంకా టోర్నీ వేదిక మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.