BJP : కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనూ తన సొంత బలంతో గెలవలేదని యూపీ బీజేపీ చీఫ్ భూపీంద్ర సింగ్ చౌధురి అన్నారు. ముస్లిం మైనారిటీల ఓట్లను కొల్లగొట్టేందుకు ఎస్పీ, కాంగ్రెస్ వారిని భయపెట్టాయని ఆరోపించారు. ఇప్పుడు క్షేత్రస్ధాయిలోకి వచ్చి అందరినీ ఒకేతాటిపైకి తీసుకురావడం తమ ముందున్న భారీ సవాల్ అని ఆయన పేర్కొన్నారు. యూపీ బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో భూపీంద్ర సింగ్ మాట్లాడారు.
ముస్లిం ఓటు బ్యాంక్‌ను గంపగుత్తా పొందడంపై కాంగ్రెస్ పనిచేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నడూ తన సొంత బలంతో రాష్ట్రాల్లో విజయం సాధించలేదని, ఇతర పార్టీల మద్దతుతో విజయం సాధిస్తోందని దుయ్యబట్టారు. గత మూడు లోక్‌సభ ఎన్నికల్లోనూ వివిధ పార్టీలతో కాంగ్రెస్ కూటమి కట్టిందని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ పూర్తిగా బంధుప్రీతి పార్టీగా మారిందని, ఆ పార్టీ రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలను అనుసరించడం లేదని బీజేపీ నేత ఆరోపించారు.
కాగా, వివిధ రాష్ట్రాల్లో జరిగిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. 11 స్ధానాల్లో విపక్ష ఇండియా కూటమి విజయకేతనం ఎగురవేయగా, బీజేపీ కేవలం 2 స్ధానాల్లోనే గెలుపొందింది. ఓ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్ధి విజయం సాధించారు. ఉప ఎన్నికల్లో ఓటమిని తమ పార్టీ అంగీకరిస్తుందని, ఓటమికి తాము ఈవీఎంలను కానీ, ఎన్నికల కమిషన్‌ను కానీ నిందించబోమని బీజేపీ నేత షజియ ఇల్మి పేర్కొన్నారు.
విపక్షాలు మాత్రం వివిధ ఎన్నికల్లో ఓటమిపాలైనా ఇప్పటివరకూ తమ ఓటమిని అంగీకరించలేదని, వారు నిత్యం ఈవీఎంలను నిందిస్తారని తాము హుందాగా ఓటమిని అంగీకరించడంతో విపక్షాల డొల్లతనం బయటపడిందని ఆరోపించారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచింది కాంగ్రెస్ పార్టీయేనని సంవిధాన్ హత్యా దివస్ వెల్లడిస్తున్నదని ఆమె పేర్కొన్నారు.
Read More :
PM Modi | ట్రంప్‌పై దాడిపట్ల ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన