Zaka Ashraf : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు జకా అష్రఫ్(Zaka Ashraf) మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. అయితే.. ఈసారి అతను తమ జట్టు స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రీదీ(Shaheen Afridi) ఒక బ్యాటర్ అని విమర్శల పాలయ్యాడు. రెండు రోజుల క్రితం ఆసియా కప్(Asia Cup 2023) షెడ్యూల్ విడుదల సందర్భంగా అష్రఫ్ మాట్లాడుతూ.. ‘మా జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. బ్యాటింగ్ గురించి చెప్పాల్సివస్తే.. మా కెప్టెన్ బాబర్ ఆజాం(babar azam) ప్రపంచంలోనే నంబర్ బ్యాటర్. అంతేకాదు మా ఆటగాళ్లు టాప్ -5 ర్యాంక్‌లో ఉన్నారు.
ఇక షాహీన్ ఆఫ్రీదీ విషయానికొస్తే.. అతడి పేరు టాప్ -10 బ్యాటర్లలో ఉంటుంది’ అని అష్రఫ్ అన్నాడు. దాంతో, షాహీన్ ఆఫ్రీదీ ఒక బౌలర్.. అతను బ్యాటర్ కాదనే విషయం అతడికి తెలియకపోవడం విచారకరం అని, పీసీబీ బాస్ అయి ఉండి .. బ్యాటర్ ఎవరు? బౌలర్ ఎవరు? అనేది కూడా తెలియదా? అంటూ… చాలామంది అష్రఫ్‌ని ట్రోలింగ్ చేస్తున్నారు. క్రికెట్‌పై ఏమాత్రం అవగాహన లేని ఇలాంటి వ్యక్తిని పీసీబీ అధ్యక్షుడిని చేశారంటూ మరికొందరు విమర్శిస్తున్నారు.
దుబాయ్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జూలై 19న ఆసియా కప్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ ఏడాది ఆసియాకప్ ముందుగా అనుకున్న ప్రకారమే హైబ్రిడ్ మోడల్(hybrid model)లో జరుగనుంది. శ్రీలంక 9, పాకిస్థాన్ 4 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఆగస్టు 30న జరిగే ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్, నేపాల్ జట్లు తలపడనున్నాయి. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ లంక వేదికగా జరుగనుంది. నిరుడు ఆతిథ్యం ఇచ్చిన లంక చాంపియన్‌గా నిలిచింది. దసున్ శనక బృందం ఫైనల్లో పాక్‌ను ఓడించి ట్రోఫీ సొంతం చేసుకుంది.
షాహీన్ ఆఫ్రీదీ
నిరుడు టీ20 వరల్డ్ కప్(T20 WC 2022) సందర్భంగా గాయపడిన షాహీన్ ఆఫ్రీదీ దాదాపు ఏడాది పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈమధ్యే కోలుకున్న అతను శ్రీలంక సిరీస్‌కు ఎంపికయ్యాడు. గాలే టెస్టులో వికెట్ తీసిన అతను ఈ ఫార్మాట్లో వంద వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసి పాక్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో, రెండు టెస్టుల సిరీస్‌లో పాక్ 1-0 ఆధిక్యంలో ఉంది.