Gianluigi : ఇటలీ, పారిస్ సెయింట్ జర్మన్ క్లబ్(PSG) గోల్ కీపర్ గియన్లుగి దొన్నరుమ్మ(Gianluigi Donnarumma) ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ప్యారిస్‌లోని గిన్లుగి ఇంట్లోకి చొరబడిన దొంగలు 5 లక్షల యూరోలు (భారతీయ కరెన్సీలో రూ.4.5 కోట్లు), నగలు, ఇతర విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. గురువారం రాత్రి దొంగలు గోల్‌కీపర్ ఇంట్లోకి వెళ్లారు. వాళ్లను గమనించిన గియన్లుగి, అతడి ప్రేయసి అలెస్సియా ఎలెఫంటే(Alessia Elefante) ప్రతిఘటించారు.
దాంతో, ఆ దొంగలు వాళ్లపై దాడిచేసి, తాళ్లతో కట్టేశారు. ఊహించని సంఘటనతో షాక్‌కు గురైన గియన్లగి, ప్రియురాలితో కలిసి సమీపంలోని హోటల్లో తలదాచుకున్నాడు. గాయాలతో ఉన్న వాళ్లను సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత వాళ్లను ఆస్పత్రికి తరలించారు.
గియన్లుగి 2021 నుంచి పీఎస్జీ క్లబ్ గోల్‌కీపర్‌గా కొనసాగుతున్నాడు. అంతకుముందు అతను ఇటలీకి చెందిన ఏసీ మిలాన్(AC Milan) క్లబ్ తరఫున ఆడాడు. తాజాగా జరుగుతున్న యూఇఎఫ్ఏ చాంపియన్స్ (UEFA Champions) లీగ్ తొలి దశలోనే పీఎస్జీ క్లబ్ అనూహ్యంగా ఇంటిదారి పట్టింది.
గియన్లుగి దొన్నరుమ్మ
ఈమధ్య స్టార్ ఆటగాళ్లు క్లబ్‌ను వీడడం జట్టు లయను దెబ్బతీసింది. అర్టెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ(Lionel Messi) ఈమధ్యే పీఎస్జీ క్లబ్‌ను వీడిన విషయం తెలిసిందే. రెండున్నర ఏళ్ల కాంట్రాక్టు ముగియడంతో మెస్సీ అమెరికాకు చెందిన ఇంటర్ మియామి(Inter Miami) క్లబ్‌తో ఒప్పందం చేసుకున్నాడు.