Paralympics 2024 : భారత పారా ఆర్చర్ శీతల్ దేవీ(Sheetal Devi) కల చెదిరింది. పారాలింపిక్స్ క్వాలిఫికేషన్ రౌండ్లో సూపర్ గురితో రెండో స్థానంలో నిలిచిన ఆమె.. వ్యక్తిగత విభాగం 8వ రౌండ్లో ఓటమి పాలైంది. శనివారం జరిగిన పోటీలో చిలీ ఆర్చర్ మరియానా జునిగ(Mariana Zuniga) చేతిలో ఒకే ఒక్క పాయింట్ తేడాతో శీతల్ ఓడింది. నువ్వా నేనా అన్నట్టు సాగిన పోరులో 137-138తో పరాజయం పాలైంది.
శీతల్ తొలి సెటన్ 29-28తో గెలుపొందింది. ఇక రెండో రౌండ్లో జునిగ 27-26తో పైచేయి సాధించింది. మూడో రౌండ్లో ఇద్దరూ పోటాపోటీగా పాయింట్లు సాధించగా 27-27తో స్కోర్ సమం అయింది. ఇక నిర్ణయాత్మక నాలుగో రౌండ్లోనూ శీతల్, జునిగలు సమాన పాయింట్లతో ఆశ్చర్యపరిచారు.
విజేతను నిర్ణయించే ఐదో రౌండ్లో శీతల్ ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చింది. అయితే.. చివరకు ఒకే ఒక పాయింట్‌తో 137-138తో ఊహించని విధంగా పరాజయం పాలైంది. మరోవైపు.. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఆర్చరీలో సరిత(Sarita) ముందంజ వేసింది. 16వ రౌండ్లో ఇటలీకి చెందిన సర్టీని 141-135తో ఓడించి క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టింది.