Holiday To Schools | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు రాగల రెండురోజు సైతం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు.
ఈ మేరకు విద్యాశాఖకు హైదరాబాద్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో అవసరమైన ఆస్తి, ప్రాణనష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, నీటిపారుదల, పోలీస్, విద్యుత్, ఆర్అండ్బీ, జీహెచ్ఎంసీ అధికారులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 040-23202813, 9063423979 నెంబరుతో పాటు హైదరాబాద్ ఆర్డీవో 7416818610, 9985117660, ఆర్డీవో సికింద్రాబాద్ 8019747481 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.