రుద్రంపూర్, ఫిబ్రవరి 18 : కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పడం మాటల్లో సులభమే. కానీ ఆ మాటలు కార్యరూపం దాల్చాలంటే ఫైళ్ల మార్పిడి, నోట్ల జత, ఒక అధికారి నుండి మరొక అధికారి వరకు తిరిగే ప్రక్రియలోనే నెలలు గడుస్తున్నాయి. ఫుట్బాల్ పోటీలు, ఇతర కార్యక్రమాలకు కోట్లు ఖర్చు చేసే సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల కనీస అవసరమైన క్యాంటీన్ విషయంలో మాత్రం ముందడుగు వేయడంలో వెనుకంజ వేస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం ఏరియా పరిధిలోని వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్ విస్తరణలో భాగంగా పాత జీఎం కార్యాలయాన్ని నూతన జీఎం కార్యాలయానికి మార్చారు. పాత కార్యాలయం వద్ద ఉన్నప్పుడు ఫీడర్ క్యాంటీన్ ద్వారా (గని వద్ద తయారైన అల్పాహారం) ఉద్యోగులకు ఉదయం టీ, అల్పాహారం అందించేవారు.
కానీ నూతన జీఎం కార్యాలయం పాత కార్యాలయం నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పద్మావతి గని నుండి వచ్చే ఫీడర్ క్యాంటీన్ సేవలు నిలిచిపోయాయి. ఫలితంగా జీఎం కార్యాలయంలో పనిచేసే సుమారు వంద మంది ఉద్యోగులు టీ, అల్పాహారం వంటి ప్రాథమిక సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. అధునాతన సౌకర్యాలతో జీఎం కార్యాలయం నిర్మించామని చెప్పుకునే అధికారులు, ఉద్యోగుల కనీస అవసరమైన క్యాంటీన్ గురించి ఆలోచించలేదా? అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. చిన్న స్థాయి లిమిటెడ్ కంపెనీలు కూడా ఉద్యోగులకు రెండు పూటలా క్యాంటీన్ సదుపాయం కల్పిస్తుంటే, వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలో ఒక్క పూట కూడా క్యాంటీన్ సౌకర్యం లేకపోవడం విచారకరం అంటున్నారు.
ప్రస్తుతం జీఎం కార్యాలయం, సివిల్ కార్యాలయం, ఏరియా వర్క్ షాప్ నూతన భవనాల్లో పని చేస్తున్నాయి. త్వరలో ఎస్ అండ్ పీసీ కార్యాలయం, ఎం వి టి సి, ఆర్ సి హెచ్ పి విభాగాలను కూడా అక్కడికే తరలించనున్నారు. మొత్తం సుమారు 400 మంది ఉద్యోగులు అక్కడ విధులు నిర్వర్తించనున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఒకే ప్రాంగణంలో పనిచేస్తున్న నేపథ్యంలో ఒక కేంద్ర క్యాంటీన్ ఏర్పాటు చేస్తే అందరికీ అందుబాటులో ఉండి ప్రయోజనం చేకూరుతుందని కార్మికులు కోరుతున్నారు. క్యాంటీన్ అనేది విలాసం కాదని, కనీస అవసరం అన్నారు. ఫైళ్ల పేరుతో కాలయాపన చేయకుండా సాధ్యమైనంత త్వరగా జీఎం కార్యాలయంలో శాశ్వత క్యాంటీన్ ఏర్పాటు చేసి ఉద్యోగుల సంక్షేమాన్ని పరిరక్షించాలని యాజమాన్యాన్ని కార్మికులు కోరుతున్నారు.