చండ్రుగొండ, ఫిబ్రవరి 18 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతయిగూడెం గ్రామంలో గల ప్రముఖ సాగునీటి ప్రాజెక్ట్ అయిన వెంగళరావు సాగర్ ప్రాజెక్ట్ అలుగు నిర్మాణం నాసిరకంగా సాగుతుందని ఆయకట్టు రైతులు ఆరోపించారు. బుధవారం ప్రాజెక్ట్ అలుగు నిర్మాణ పనులను, అక్కడ నిర్మాణ పనులకు వాడే ఇసుక, కంకరను రైతులు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ అలుగు నిర్మాణం కోసం రూ.33 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభం కాగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల నిర్మాణ పనుల్లో నాసిరకం ఇసుక, అనగా లోకల్ ఇసుక వాడుతూ నాసిరకం కంకర, ఇనుమును వాడుతున్నట్లు రైతులు ఆరోపించారు. కోట్లాది రూపాయల పనులు జరుగుతున్నా ఇరిగేషన్ శాఖ అధికారులు కనీసం పర్యవేక్షణ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. చండ్రుగొండ మండలానికి ప్రధాన సాగునీటి ప్రాజెక్ట్ అయిన వెంగళరావు సాగర్ కు అలుగు నిర్మాణం కోసం నిధులు మంజూరు కావడం అదృష్టం అని, పనులు లోపం వల్ల ప్రాజెక్ట్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2,500 ఎకరాల ఆయకట్టు సాగు ఉన్న ప్రాజెక్టును రక్షించాలని కోరారు.