Asian Snooker Team Championship : ప్రతిష్ఠాత్మక ఆసియా స్నూకర్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. వరల్డ్ ఛాంపియన్ పంకజ్ అద్వానీ (Pankaj Advani) సారథ్యంలోని బృందం సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో ఖతార్(Qatar)పై జయభేరి మోగించింది భారత్. ఏకపక్షంగా సాగిన పోరులో 3-0తో ప్రత్యర్థిని చిత్తు చేసి టైటిల్‌కు మరింత చేరువైంది ఇండియా.
కొలంబో వేదికగా జరుగుతున్న ఆసియా స్నూకర్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టు అదరగొడుతోంది. వరుసపెట్టి ప్రత్యర్ధులకు చెక్ పెడుతూ సెమీస్ చేరుకుంది. ఉదయం నిర్వహించిన తొలి సెషన్లో భారత త్రయం తమ ఆఖరి గ్రూప్ సీ మ్యాచ్‌లో హాకాంగ్ -2 టీమ్‌ను మట్టికరిపించి నాకౌట్ దశకు అర్హత సాధించింది.
అనంతరం వరల్డ్ గేమ్స్ మాజీ గోల్డ్ మెడలిస్ట్ బషర్ అబ్దుల్ మజీద్‌కు పంకజ్ షాకిచ్చాడు. ఇక డబుల్స్‌లో అద్వానీ, బ్రిజేష్ దమని ద్వయం 72-5తో అల్ ఒబైదిల్ మజీద్ జంటను ఓడించారు. హాంకాంగ్ -1, బహ్రెయిన్ మ్యాచ్ విజేతను తర్వాత రౌండ్లో భారత స్నూకర్ టీమ్ ఢీకొననుంది.