Eggs Nutrition Facts | కోడిగుడ్లు అంటే చాలా మంది ఇష్టంగానే తింటారు. కోడిగుడ్లతో చేసే ఏ వంటకం అయినా రుచిగానే ఉంటుంది. కోడిగుడ్లును కొందరు ఉడకబెట్టి తింటే కొందరు ఆమ్లెట్ రూపంలో తింటారు. ఇంకా కొందరు వేపుడు, పులుసు, బిర్యానీ వంటి వెరైటీలు చేసుకుని తింటారు. అయితే కోడిగుడ్డును పోషకాలకు గనిగా చెబుతారు. మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు గుడ్లలో ఉంటాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. అందుకనే రోజుకు ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డును తినాలని వారు సూచిస్తుంటారు. ఇక చిన్నారులకు అయితే కచ్చితంగా గుడ్డు తినిపించాలని వారు సూచిస్తుంటారు. అయితే కోడిగుడ్డులో ఉండే పోషకాల విషయానికి వస్తే.. ఒక మీడియం సైజ్ కోడిగుడ్డు ద్వారా సుమారుగా 70 క్యాలరీల నుంచి 80 క్యాలరీల మేర శక్తి లభిస్తుంది. ప్రోటీన్లు 7 గ్రాముల మేర లభిస్తాయి.
కోడిగుడ్లలో మన శరీరానికి కావల్సిన పూర్తి స్థాయి ప్రోటీన్లు ఉంటాయి. మొత్తం 9 రకాల అమైనో ఆమ్లాలు గుడ్లలో ఉంటాయి. కనుకనే కోడిగుడ్లను సంపూర్ణ పౌష్టికాహారం అని పిలుస్తారు. కోడిగుడ్డు తెల్ల సొనలో 3.6 గ్రాముల మేర ప్రోటీన్లు ఉంటే మిగిలిన సొనలో మిగతా ప్రోటీన్లు లభిస్తాయి. కోడిగుడ్డు పచ్చసొనలో కొవ్వులతోపాటు పలు రకాల విటమిన్లు, మినరల్స్ కూడా ఉంటాయి. ఒక కోడిగుడ్డును ఉడకబెట్టి తింటే సుమారుగా 6 గ్రాముల మేర కొవ్వు లభిస్తుంది. ఇందులో శాచురేటెడ్ కొవ్వు 1.6 గ్రాములు, మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వు 2 గ్రాములు (ఆరోగ్యకరమైన కొవ్వు), పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వు 1 గ్రాము (ఆరోగ్యకరమైన కొవ్వు) లభిస్తాయి. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా కోడిగుడ్డులో స్వల్ప మొత్తంలో ఉంటాయి.
కోడిగుడ్డును ఉడకబెట్టి తింటే సుమారుగా 185 మిల్లీగ్రాముల మేర కొలెస్ట్రాల్ లభిస్తుంది. మన శరీరానికి రోజుకు 200 మిల్లీగ్రాముల మేర కొలెస్ట్రాల్ అవసరం. కనుక ఎవరైనా రోజుకు ఒక గుడ్డును నిరభ్యంతరంగా తినవచ్చు. అంతకు మించితే మాత్రం శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది రక్త నాళాల్లో పేరుకుని బీపీ వచ్చేలా చేస్తుంది. గుండె జబ్బులను కలగజేస్తుంది. కనుక కోడిగుడ్డును రోజుకు ఒకటి మాత్రమే తినాలి. శారీరక శ్రమ చేసేవారు, వ్యాయామం చేసేవారు పోషకాహార నిపుణుల సూచన మేరకు రోజూ గుడ్లను తినాల్సి ఉంటుంది. ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డులో పిండి పదార్థాలు దాదాపుగా శూన్యమనే చెప్పాలి. ఫైబర్ కూడా గుడ్డులో ఉండదు.
ఒక కోడి గుడ్డులో విటమిన్ ఎ, విటమిన్ డి, ఇ, కె, విటమిన్లు బి2, బి5, బి6, బి9, బి12 ఉంటాయి. వీటి వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం, శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకలు దృఢంగా మారుతాయి. శరీరానికి శక్తి లభిస్తుంది. హార్మోన్ల పనితీరు మెరుగు పడుతుంది. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. నాడీ మండల వ్యవస్థ చురుగ్గా ఉంటుంది. రక్తం తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. కోడిగుడ్లలో ఉండే కోలిన్ నాడుల పనితీరుకు ఉపయోగపడుతుంది. కోడిగుడ్డులో సెలీనియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, క్యాల్షియం, అయోడిన్ వంటి మినరల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. కనుకనే కోడిగుడ్లను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. కాబట్టి రోజుకు ఒక కోడిగుడ్డును ఉడకబెట్టి తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.