Pahalgam Attack : పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తత నెలకొంది. టెర్రరిస్ట్ అటాక్ ప్రభావంతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌కు చెందిన సెలబ్రిటీలు, క్రికెటర్లు, మాజీ ఆటగాళ్ల సోషల్ మీడియా (Social Media) ఖాతాలపై కేంద్రం నిషేధం విధిస్తోంది.
ఇప్పటికే షోయబ్ అక్తర్, వసీం అక్రమ్(Wasim Akram), వకార్ యూనిస్‌ల.. ఇన్‌స్టా, యూట్యూబ్ ఖాతాలు మనదేశంలో పనిచేయడం లేదు. తాజాగా మాజీ కెప్టెన్ బాబర్ అజాం(Babar Azam), ప్రస్తుత సారథి మహ్మద్ రిజ్వాన్, పేసర్ షాహీన్ ఆఫ్రిదిల ఇన్‌స్టా అకౌంట్లను కేంద్రం నిలిపివేసింది.
INSTAGRAM ACCOUNTS OF BABAR AZAM & SHAHEEN AFRIDI HAVE BEEN BANNED IN INDIA. 🚨 pic.twitter.com/qcNtoHAXCF
— Kifayat Aftab (@kifayataftab23) May 2, 2025
పాకిస్థాన్ సినీతారలు హనియా అమిర్, అలీ జఫర్ ఇన్‌స్టా అకౌంట్లను సైతం నిషేధించారు. ఇప్పటికే దాయది దేశానికి చెందిన మాజీ క్రికెటర్లు బసిత్ అలీ, షాహిద్ ఆఫ్రిదిల యూట్యూబ్ ఖాతాలను కేంద్రం నిలిపి వేసిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని బైసరన్ లోయ(Baisaran Valley)లో ఉగ్రదాడికి భారత ప్రభుత్వం ప్రతీకారానికి సిద్ధమవుతోంది.
వేసవిలో పర్యటనలతో సేదతీరేందుకు వచ్చిన 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల కోసం భారత సైన్యం జల్లెడ పడుతుంది. అమాయకులను బలిగొన్న టెర్రరిస్టుల ఇళ్లను పేల్చేసిన భారత ఆర్మీ.. వాళ్లను మట్టుబెట్టేందుకు వ్యూహ రచన చేస్తోంది. రెండు రోజుల క్రితమే భద్రతా అధికారులతో సమావేశం కీలక సమావేశం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ప్రతీకార దాడికి అనువైన స్థలం, సమయాన్ని ఎంచుకోవాల్సిన బాధ్యతలను వాళ్లకే అప్పగించారు.